
పండ్లు కేవలం రుచికి మాత్రమే కాదు.. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, వ్యాధుల నుండి కాపాడతాయి. ముఖ్యంగా సిట్రస్ పండ్లు విటమిన్ సి అందిస్తే, అరటిపండ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ప్రతి పండుకు దానిదైన ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనం ఉంది. సాధారణంగా వచ్చే కొన్ని చిన్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఏ పండ్లు ఎంత బాగా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో లేదా బయటకు వెళ్లినప్పుడు డీహైడ్రేషన్ సాధారణ సమస్య. ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే నీటిని అందించి, డీహైడ్రేషన్ నుండి బయటపడేలా చేస్తుంది. ఎండలో నుంచి వచ్చినప్పుడు లేదా దాహం ఎక్కువగా ఉన్నప్పుడు తినడం మంచిది.
పరుగెత్తినప్పుడు పడుకున్న వెంటనే లేచినప్పుడు అకస్మాత్తుగా కండరాల తిమ్మిరి వస్తుంటుంది. అవకాడోలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల తిమ్మిరిని తగ్గించడంలో, కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొద్దిగా పని చేసినా లేదా నడిచినా వెంటనే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? అయితే మీ శరీరం శక్తి కోసం అడుగుతోందని అర్థం. అరటిపండులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది మీ అలసటను తగ్గించి, ఉత్సాహంగా ఉంచుతుంది.
తరచుగా చిన్న చిన్న తలనొప్పులు వస్తుంటే, మందుల బదులు బెర్రీలను ప్రయత్నించండి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, మంటను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
శరీరానికి అలవాటు లేని ఆహారం తీసుకోవడం వల్ల లేదా జీర్ణ సమస్యల వల్ల కడుపు ఇబ్బంది పడుతుంది. బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు సమస్యలను సరిచేస్తుంది.
మీ శరీరంలో శక్తి లేదని, మందకొడిగా ఉందని అనిపిస్తే, ప్రతిరోజూ ఒక ఆపిల్ తినండి. ఆపిల్‌లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఉంటాయి. ఇది చక్కెరను నెమ్మదిగా విడుదల చేసి, రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది. అందుకే “రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు” అంటారు.
రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నట్లయితే, చెర్రీస్‌ను ఆహారంలో చేర్చుకోండి. చెర్రీస్‌లో మెలటోనిన్ అనే సహజ హార్మోన్ ఉంటుంది, ఇది నిద్ర-మేల్కొలుపు చక్రాలను నియంత్రిస్తుంది. ఇది నిద్రలేమిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, దానిమ్మ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
ఈ పండ్లను తినడం ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. కానీ మీకు దీర్ఘకాలిక వ్యాధులు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)