
దంతాలు సెన్సిటివ్‌గా మారడానికి, రంగు మారడానికి మనం బాధ్యతాయుతంగా చేస్తున్నామనుకునే కొన్ని పొరపాట్లే కారణం. ఆమె తన దంతాలు తెల్లగా మెరవాలని రోజూ గట్టిగా బ్రష్ చేస్తుంది. అతను దంతాల పైన మరకలు పోవాలని సోషల్ మీడియాలో చూసిన నిమ్మరసం, బేకింగ్ సోడా చిట్కాలను పాటిస్తాడు. వీరు తమ దంతాలను రక్షించుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి వారు తమ దంతాల ఆయుష్షును తగ్గించుకుంటున్నారు. ఒక్కసారి దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటే, అది మళ్ళీ తిరిగి రాదు. దంతాల సెన్సిటివిటీకి, చిగుళ్ల సమస్యలకు కారణమవుతున్న ఆ 5 అలవాట్లేంటో తెలుసుకుందాం..
చాలామంది గట్టిగా బ్రష్ చేస్తే దంతాలు శుభ్రపడతాయని నమ్ముతారు. కానీ, గట్టి బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌తో అతిగా రుద్దడం వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్ పొర అరిగిపోతుంది. ఇది దంతాలను బలహీనపరిచి, సెన్సిటివిటీకి దారితీస్తుంది. ఎప్పుడూ సాఫ్ట్ బ్రష్‌ను వాడటం, సున్నితంగా బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి.
మనం తాగే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, టీ, కాఫీ మరియు పుల్లని పండ్ల రసాలలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాసిడ్ దంతాల ఎనామిల్ పొరను నెమ్మదిగా కరిగించేస్తుంది. ఇటువంటి పానీయాలు తాగిన వెంటనే నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం లేదా స్ట్రా వాడటం ద్వారా దంతాలకు ముప్పు తగ్గించవచ్చు.
నోటిలోని లాలాజలం దంతాలకు సహజ సిద్ధమైన రక్షణ కవచం. ఇది యాసిడ్లను నిర్వీర్యం చేసి దంతాలను కాపాడుతుంది. నీళ్లు తక్కువగా తాగడం, కాఫీ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గి దంతాలు ప్రమాదంలో పడతాయి. అందుకే రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటం దంతాలకు ఎంతో ముఖ్యం.
సోషల్ మీడియాలో కనిపించే నిమ్మరసం, బొగ్గు పొడి, బేకింగ్ సోడా వంటి ఇంటి చిట్కాలు దంతాలను తాత్కాలికంగా తెల్లగా మార్చవచ్చు, కానీ అవి ఎనామిల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీనివల్ల దంతాలు మరింత పసుపు రంగులోకి మారి, సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంది.
మనం వాడే సాధారణ పేస్టులు కేవలం దంతాలను శుభ్రం చేయడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ ఎనామిల్ రక్షణకు ప్రత్యేకమైన పేస్టులు అవసరం. దంతాల ఎనామిల్‌ను తిరిగి దృఢపరిచే ఫ్లోరైడ్ ఆధారిత పేస్టులను వాడటం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దంతాల ఎనామిల్ అనేది ఒక రక్షణ కవచం. బ్రష్ చేసే విధానం మార్చుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, దంతాలను తేమగా ఉంచుకోవడం ద్వారా ఈ అపురూపమైన సంపదను కాపాడుకోవచ్చు. అందమైన నవ్వు కంటే ఆరోగ్యకరమైన దంతాలు ముఖ్యం.