
మన దైనందిన ఆహారంలో చక్కెర ఒక అంతర్భాగంగా మారింది. కాఫీ, టీ, బిస్కెట్లు, శీతల పానీయాలు, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో అధిక మొత్తంలో పంచదార ఉంటుంది. అయితే, ఈ చక్కెర వినియోగం అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం 30 రోజుల పాటు పంచదారకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? నెల రోజులు షుగర్ కట్ తో శరీరంలో ఏం జరుగుతుంది? హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పంచదార మానేయడం వల్ల శరీరంలోకి వెళ్లే అనవసరపు క్యాలరీలు ఆగిపోతాయి. దీనివల్ల ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరగడం ప్రారంభమవుతుంది. నెల రోజుల్లోనే మీ బరువులో స్పష్టమైన మార్పును చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు మొదటి అడుగు అవుతుంది.
ఎక్కువగా చక్కెర తినడం వల్ల రక్తంలోని గ్లూకోస్ కొలాజెన్ తో కలిసి గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారి తీస్తుంది. ఈ ప్రక్రియ చర్మంపై ముడతలు, మొటిమలు రావడానికి కారణమవుతుంది. 30 రోజుల పాటు పంచదార మానేస్తే చర్మం మళ్లీ నిగారింపును సంతరించుకుంటుంది. మీ వయసు మరింత యవ్వనంగా కనిపిస్తుంది, చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అవుతుంది. కేవలం నెల రోజులు పంచదారకు దూరంగా ఉంటే చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు మెరుగుపడతాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది.
మనం తినే చక్కెరను కాలేయం (లివర్) మాత్రమే ప్రాసెస్ చేయగలదు. ఎక్కువ చక్కెర తీసుకుంటే అది కొవ్వుగా మారి కాలేయంలో పేరుకుపోతుంది. దీనిని ఫ్యాటీ లివర్ అని అంటారు. పంచదార మానేయడం వల్ల కాలేయం తనను తాను క్లీన్ చేసుకుని, టాక్సిన్స్ ను బయటకు పంపించేస్తుంది. తద్వారా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
చక్కెర ఎక్కువగా తీసుకునే వారిలో నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. పంచదార మానేసిన మొదటి వారం కాస్త ఇబ్బంది అనిపించినా, ఆ తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ మెరుగై రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర వస్తుంది. నిద్ర నాణ్యత పెరగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. మూడ్ స్వింగ్స్ తగ్గి, రోజువారీ కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది.
శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్లే టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. నెల రోజుల పాటు పంచదార తీసుకోకపోతే ప్యాంక్రియాస్ పై ఒత్తిడి తగ్గి, ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
30 రోజులు నో షుగర్ ఛాలెంజ్ ప్రారంభించిన మొదటి మూడు నుంచి నాలుగు రోజులు క్రేవింగ్స్ అంటే చక్కెర తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆ మానసిక అడ్డంకిని దాటి 30 రోజులు పూర్తి చేసినట్టయితే, మీ శరీరం సరికొత్తగా, ఆరోగ్యంగా మారుతుంది. అయితే, పంచదార మానేయడం అంటే కేవలం తెల్లటి పంచదార మాత్రమే కాదు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన బేకరీ ఐటమ్స్‌కు కూడా దూరంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్పు మీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లకు నాంది పలుకుతుందని డైటీషియన్లు చెబుతున్నారు.