
తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అందుకే.. తులసి ఆకులను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు తరచూ చెబుతుంటారు. అంతేకాకుండా.. తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా పూజిస్తారు. భారతీయ సంప్రదాయ వైద్యంలో, ముఖ్యంగా ఆయుర్వేదంలో, తులసిని పురాతన కాలం నుండి అనేక వ్యాధులకు చికిత్సగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులలో ఉండే పోషకాలు ఔషధాలుగా పనిచేసి .. ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.. అందుకే.. తులసి చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల అనేక రోగాలు రావని మన పెద్దలు చెబుతారు. అయితే.. ప్రతిరోజు పరగడుపున మూడు తులసి ఆకులను తినడం వల్ల శరీరంలో కలిగే మార్పులు.. అవి మనకు ఏ విధంగా మేలు చేస్తాయి..? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకుందాం..
తులసి ఆకులలో విటమిన్లు A, C, K తోపాటు.. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన శక్తివంతమైన ఔషధ మొక్క.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మంటను తగ్గించడం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..
ఒత్తిడి తగ్గింపు – మానసిక ప్రశాంతత: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, పరుగులు తీసే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతిరోజు పరగడుపున మూడు తులసి ఆకులను తినడం వల్ల మానసిక ప్రశాంతత లభించి, మంచి ఆలోచనలు కలిగేలా సహాయపడుతుంది.
షుగర్ వ్యాధి నియంత్రణ: శ్రమ లేని ఉద్యోగాలు పెరగడం, నిత్యం కూర్చుని పని చేయడం వల్ల షుగర్ వ్యాధి విస్తరిస్తోంది. ప్రతిరోజు మూడు తులసి ఆకులు తినడం వల్ల షుగర్ వ్యాధి రాకుండా నివారించవచ్చని, ఇప్పటికే ఉన్న వారికి దానిని తగ్గించవచ్చని చెప్పబడుతోంది.
అధిక రక్తపోటు అదుపు: తులసి ఆకులు అధిక రక్తపోటును సైతం అదుపులో ఉంచుతాయి. రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు మూడు తులసి ఆకులు పరగడుపున తింటుంటే కొన్ని రోజులకే మందులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని సూచిస్తున్నారు.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది: ప్రతిరోజు తులసి ఆకులు తినడం వల్ల జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. చదువుకునే పిల్లలు ఇలా తింటుంటే వారి మెదడు చురుకుగా మారుతుంది.
శారీరక ధృడత్వం – ముఖతేజస్సు: నిత్యం తులసి ఆకులు తీసుకునే వారి శరీరం దృఢంగా మారుతుంది.. ముఖతేజస్సు పెరుగుతుంది.
తలనొప్పి నివారణ: తలనొప్పితో బాధపడేవారు ప్రతిరోజు తులసి ఆకులు తింటుంటే తలనొప్పి క్రమంగా తగ్గి భవిష్యత్తులో అసలు రాదని పేర్కొంటున్నారు. తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు గ్లాసు నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసి మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగితే తక్షణం ఉపశమనం లభిస్తుందని సంప్రదాయ పద్ధతులు సూచిస్తున్నాయి.
నోటి ఆరోగ్యం: ప్రతిరోజు మూడు తులసి ఆకులు పరగడుపున తింటుంటే నోటి దుర్వాసన పోయి, నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
పిల్లల మానసిక ఎదుగుదల: మానసిక ఎదుగుదల లేని పిల్లలకు తులసి ఆకులను తినిపించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని పేర్కొంటారు.
జీర్ణ సమస్యలు – కడుపు పుండ్లు: తులసి ఆకులు పొట్టలో పుండ్లు ఉంటే మానేలా చేస్తాయి. అజీర్తి సమస్యలతో బాధపడేవారు ఇలా తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తరచుగా కడుపునొప్పితో బాధపడేవారు ఇలా తింటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
రోగనిరోధక శక్తి – శ్వాసకోశ ఆరోగ్యం: తులసి ఆకులు తరచుగా జలుబు చేయడం, జ్వరం రావడం తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కంటిచూపు మెరుగుదల: నిత్యం తులసి ఆకులు తినేవారి కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పైబడిన వారు రోజూ ఇలా తింటుంటే వారి దృష్టి లోపాలను పోగొడుతుంది.. చూపును పెంచుతుంది.
జ్వరం నుంచి ఉపశమనం: మలేరియా జ్వరం ఇబ్బంది పెడుతుంటే ఏడు తులసి ఆకులు, ఏడు మిరియాలు కలిపి నమిలి మింగితే మూడు రోజుల్లో మలేరియా జ్వరం తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్న తులసి ఆకులను ప్రతిరోజు పరగడుపున మూడు ఆకులను తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.. అయితే.. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.. అయితే, ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..