
ప్రస్తుతం సూపర్ మార్కెట్లకు వెళ్తే ఎక్కడ చూసినా హై ప్రోటీన్, ఆల్ నేచురల్, ఆర్గానిక్ అనే లేబుల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి చూడగానే కస్టమర్లు అవి ఆరోగ్యానికి చాలా మంచివని భ్రమపడి కొనేస్తున్నారు. ఇలాంటి ఆహార పదార్థాల చుట్టూ మార్కెటింగ్ కంపెనీలు ఒక అపోహను సృష్టించాయి. కానీ వాస్తవానికి ఇవి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం రోజూ తీసుకునే ఆహారపు అలవాట్లే భవిష్యత్తులో వచ్చే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను నిర్ధారిస్తాయని మాయో క్లినిక్ హార్ట్ గైడ్ కో ఆథర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కైలా లారా-బ్రెయిటింగర్ స్పష్టం చేశారు. చాలామంది పేషెంట్లు తమ కొలెస్ట్రాల్ పెరిగిందని వస్తుంటారని, తీరా విచారిస్తే వారు హెల్తీ అనుకుని తింటున్న ఫుడ్స్ వల్లే ఈ సమస్య వస్తుందని ఆమె తెలిపారు. బిజినెస్ ఇన్‌సైడర్‌తో ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైనవని భావించి, గుండెకు ముప్పు తెచ్చే 3 ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతిదానిలోనూ ఎక్స్‌ట్రా ప్రోటీన్ జోడించడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ ప్రోటీన్ డ్రింక్స్, స్నాక్స్‌లో ఎవరూ ఊహించని పదార్థాలు దాగి ఉంటున్నాయి. చాలా ప్రోటీన్ షేక్స్‌లో ఒక చాక్లెట్ బార్ లేదా సోడాలో ఉండేంత చక్కెర ఉంటోంది. ఒకవేళ షుగర్ ఫ్రీ అని రాసి ఉన్నా, వాటిలో వాడే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ జీర్ణవ్యవస్థను దెబ్బతీసి, మరిన్ని ఫుడ్ క్రేవింగ్స్‌ను పెంచుతాయి. ప్రాసెస్డ్ షేక్స్‌కు బదులుగా.. సాల్టెడ్ సోయాబీన్స్ వంటి సహజ సిద్ధమైన పదార్థాలను స్నాక్స్‌గా తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల ప్రోటీన్‌తో పాటు గుండెకు మేలు చేసే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
గ్రానోలా అనగానే అందరూ అల్టిమేట్ హెల్త్ ఫుడ్ అనుకుంటారు. కానీ కమర్షియల్ బ్రాండ్స్ దాన్ని టేస్టీగా మార్చడం కోసం విపరీతంగా ప్రాసెస్ చేస్తాయి. ఈ ప్రాసెసింగ్‌లో గ్రానోలాలో ఉండే సహజమైన ఫైబర్ మొత్తం పోతుంది. దానికి తోడు అన్ హెల్తీ ఫ్యాట్స్, భారీ మొత్తంలో చక్కెరను యాడ్ చేస్తారు. కాబట్టి ప్యాకెట్ వెనుక ఉండే లేబుల్‌ను జాగ్రత్తగా గమనించాలి. మార్కెట్ గ్రానోలాకు బదులు గుప్పెడు మిక్స్‌డ్ నట్స్, ఫ్రూట్స్ తినడం లేదా ఇంట్లోనే సొంతంగా గ్రానోలా తయారు చేసుకోవడం మంచిది.
వీగన్, వెజిటేరియన్ ప్రొడక్ట్స్‌లో కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతుండటంతో.. ఇది చాలా ఆరోగ్యకరమైనదనే ముద్ర పడిపోయింది. ఎనర్జీ బార్స్, చిప్స్ వంటి వాటిలో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు. కొబ్బరి నూనెలో శ్యాచురేటెడ్ ఫ్యాట్ అత్యధికంగా ఉంటుంది. ఇది వెన్న లేదా బీఫ్ ఫ్యాట్ కంటే కూడా ఎక్కువ.‘‘చాలామంది తాము అంతా హెల్తీ ఫుడ్డే తింటున్నా కొలెస్ట్రాల్ ఎందుకు పెరిగిందని ఆశ్చర్యపోతుంటారు. దానికి కారణం వారు ప్రతి వంటకాన్ని కొబ్బరి నూనెతో వండటమే’’ అని డాక్టర్ కైలా వివరించారు. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న ఆహార నిర్ణయాలే లాంగ్ రన్‌లో మన ప్రాణాలను కాపాడుతాయి. గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది’’ అని డాక్టర్ కైలా లారా-బ్రెయిటింగర్ గుర్తుచేశారు.