లడాఖ్ సరిహద్దుల్లో మరిన్ని దళాల పాక్షిక ఉపసంహరణపై భారత్ తో తాము చర్చిస్తున్నామని చైనా వెల్లడించింది. ఉభయ దేశాల మధ్య తొమ్మిదో దఫా చర్చలు జరగనున్న తరుణంలో ఇదే ప్రధాన ఎజెండా అని చైనా విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హువా చున్ ఇంగ్ తెలిపారు. గత 6నవంబరు కోర్స్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ అవి నిర్దిష్టమైన ఫలితాలనివ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దౌత్య, సైనిక స్థాయిల్లో సంప్రదింపులు జరుగుతున్నాయని, బోర్డర్స్ లో ఇంకా పాక్షిక ఉపసంహరణలు జరగాల్సిన వసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ నెలలో నిర్వహించదలచిన చర్చల్లో కీలకాంశాలపై ఏకాభిప్రాయం కుదరగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా సాగిన సంప్రదింపుల సారాంశాన్ని సమీక్షిస్తున్నట్టు హువా చున్ ఇంగ్ తెలిపారు.
ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. అటు-తూర్పు లడాఖ్ లోని వివిధ లొకేషన్లలో దాదాపు 50 వేలమంది భారత సైనికులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉన్నారు. ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల వాతావరణంలో కంటికి రెప్పలా సరిహద్దులను వారు కాపాడుతున్నారు. అయితే చైనా సేనలు కూడా ఇంతే స్థాయిలో మోహరించి ఉండడం ఆందోళన కలిగించే అంశం.