హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో గోడ కూలి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలివారంతా భయబ్రాంతులకు గురయ్యారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ ప్రైవేటు హాస్టల్ పక్కనే ఉన్న సెల్లార్ కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సెల్లార్ పక్కనే ఉన్న గది గోడ కూలడంతో హాస్టల్‌లో ఉన్న వారందరూ భయబ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే…
పత్రికానగర్‌లో నివసిస్తున్న ఓ తల్లి కొడుకులు గత మూడేళ్లుగా ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే, కొన్ని రోజులుగా హాస్టల్ పక్కనే భవన నిర్మాణం చేసేందుకు సెల్లార్‌ను తీస్తున్నారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కి అదనంగా ఉన్న గది గోడ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో గదిలో నిద్రిస్తున్న నిర్వాహకురాలికి తీవ్రగాయాలయ్యాయి. రెండు చేతులు, వెన్నెముక దెబ్బతిన్నాయి. మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.
హాస్టల్ కింది భాగమంతా బీటలు వారడంతో ప్రమాదకరంగా మారింది. ఇందులో ఉన్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశించారు. దీంతో దాదాపు 70 మంది విద్యార్థినులు, వర్కింగ్ ఉమెన్స్ వారివారి లగేజ్‌లు తీసుకొని వెళ్లిపోయారు. ప్రమాదం అనంతరం జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పోలీసులు స్థల యాజమానులపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి సెల్లార్‌లను తీసే సమయంలో ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూ చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటివి ఏమి చేయకుండానే ఇక్కడ సెల్లార్‌లను తవ్వినట్లు అధికారులు తెలిపారు.