పైన పటారం.. లోన లొటారం.. మెట్రో దూకుడుకు బ్రేక్ పడిందా..?

నిన్న అమీర్ పేట, నేడు రసూల్ పురా మరి రేపు ఎక్కడో..! మెట్రో ఎంతో భద్రం, సురక్షితం అని అధికారులు చేసిన ప్రచారం మాటలకే పరిమితమని తెలుస్తోంది. మెట్రో నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ నిండు ప్రాణాలు బలయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెట్రో నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. మెట్రో పిల్లర్స్ పటిష్టతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పిల్లర్స్ సెగ్మెంట్ల మధ్య అతుకుల్లో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వర్షం పడుతుండగా మౌనిక అనే […]

పైన పటారం.. లోన లొటారం.. మెట్రో దూకుడుకు బ్రేక్ పడిందా..?
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 4:27 PM

నిన్న అమీర్ పేట, నేడు రసూల్ పురా మరి రేపు ఎక్కడో..! మెట్రో ఎంతో భద్రం, సురక్షితం అని అధికారులు చేసిన ప్రచారం మాటలకే పరిమితమని తెలుస్తోంది. మెట్రో నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ నిండు ప్రాణాలు బలయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెట్రో నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. మెట్రో పిల్లర్స్ పటిష్టతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పిల్లర్స్ సెగ్మెంట్ల మధ్య అతుకుల్లో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వర్షం పడుతుండగా మౌనిక అనే మహిళ మెట్రో స్టేషన్‌లో నిలుచుందామని వెళ్లగా.. పై నుంచి పెచ్చులూడి పడటంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ ఆవరణలో ఈ ఘటన జరిగింది.

తాజాగా రసుల్ పురా మెట్రో స్టేషన్‌ పై భాగంలో పెచ్చులూడినట్లు కనిపిస్తోంది. మెట్ల పక్కనే మూల ప్రాంతంలో కాంక్రీట్ కూడా ఊడిపోయి స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రో నిర్మాణం పూర్తి చేసి సంవత్సరం కావస్తుండగానే ఇలాంటి ప్రమాదం జరగడం అందరిలోనూ అనుమానాలు కలిగిస్తోంది. ఎన్నో సంవత్సరాల పాటు నగరవాసులకు సేవలు అందిచాల్సిన మెట్రోలో.. అప్పుడే లోపాలు బయటపడుతున్నాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌‌తో చేసినవి కావడంతో సరిగ్గా అతుక్కోని ఉండక పోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మనకు కనిపిస్తున్నవి కొన్ని మాత్రమే.. ఇందులో ఇంకెన్నీ లోపాలు ఉన్నాయో అధికారులకే తెలియాలి.

మెట్రో పిల్లర్స్ కాని, స్టేషన్లలో కాని ఎక్కడ డేంజర్ సిగ్నల్స్ లేవు. కనీసం హెచ్చరికలు కూడా జారీ చేసిన దాఖలాలు లేవు. దీంతో మెట్రో రైల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం రద్దీగా ఉంటూ.. వేలాది మంది నడిచే ప్రాంతంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు.

హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో అమీర్ పేట వేరీ స్పెషల్. ఫస్ట్ ఫేస్‌లోనే దీని నిర్మాణం పూర్తైంది. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ఎల్ అండ్ టీ పూర్తి బాధ్యత వహించింది. మెట్రో సేవలు ప్రారంభమైన నాటికే.. ప్రాజెక్టు పనులు ప్రారంభమై 5 సంవత్సరాలు గడిచాయి. కాగా, దీని సేవలు సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2017 నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. ముందుగా అమీర్ పేట నుంచి నాగోలు వరకూ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చే ముందే.. ట్రయల్ రన్స్ జరిపి.. ఎలాంటి ఇబ్బందులు లేవని తెలవని.. ఎల్ అండ్ టీ అధికారులు కన్ఫామ్ చేశాకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు దశాబ్దాల పాటు దీనికి ఢోకా లేదని, ఏళ్లు తరబడి దీని సేవలు వినియోగించుకోవచ్చని చెప్పారు. మరి ఇప్పుడేమంటారు.

మొదటి ఫేజ్ లో ప్రారంభించిన అమీర్ పేట, రసూల్ పురా ప్రాంతాల్లోనే తాజా ఉదంతాలు జరిగాయి. అమీర్ పేటలోనైతే ఓ నిండు ప్రాణం బలైంది. రసూల్ పురాలో ప్రమాదం తప్పింది. జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఇందుకు ఎల్ అండ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమా..? పనులు నిరంతరం పర్యవేక్షించిన మెట్రో అధికారుల పర్యవేక్షణా లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా..? మరి అర్భన్ డెవలప్ మెంట్ అధికారులేం చేస్తున్నారు.? అంటూ నగరవాసులు మండిపడుతున్నారు. ఇన్ని లోపాలను పెట్టుకుని క్వాలిటీ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారంటూ మెట్రోవాసులు ప్రశ్నిస్తున్నారు. అయితే వర్షం కురిసినప్పుడు.. మెట్రో షెడ్‌ల కింద నిలబడే వారంతా ఈ ఘటనను చూసి భయపడుతున్నారు. ఇక, వర్షం కురిసిన ప్రతిసారి మెట్రో కారిడార్లలో చాల చోట్ల వర్షపు నీరు లీకవుతూ.. పిల్లర్లు, మెట్రోస్టేషన్ల నుంచి రోడ్లపై పడుతోంది. ఇలా చాలా చోట్ల వర్షపునీరు పడడం వల్ల అక్కడ నిర్మాణ భాగం తడిసి పోయి ప్రమాదం పొంచి ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. వర్షపునీరు లీకేజీ కారణంగా ఆ ప్రాతంలో గోడలు, ఇతర నిర్మాణాలు త్వరగా పాడై పోయే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు బాధితురాలి కుటుంబసభ్యులు అధికారుల నిర్లక్ష్యమే మౌనిక ప్రాణాలు తీసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణానికి క్వాలిటీ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.