హైదరాబాద్ దాటి.. నార్త్ లో ఒవైసీ వ్యూహం.. విస్తరిస్తున్న ఎంఐఎం

|

Oct 28, 2019 | 6:34 PM

19 వ లోక్ సభలో కేవలం ఇద్దరు ఎంపీలతో ‘ అతిపెద్ద పార్టీ ‘ గా అవతరించిన ఎంఐఎం (మజ్లిస్ పార్టీ) మెల్లగా హిందీ బెల్ట్ లో విస్తరిస్తోంది. ఈ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదారాబాద్ ‘ పాతబస్తీ ‘ నుంచి తన పార్టీని క్రమంగా దేశవ్యాప్తం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్కువమంది ఉన్నా సరే.. దేశ రాజకీయాల్లో పరోక్షంగా చక్రం తిప్పుతున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ […]

హైదరాబాద్ దాటి.. నార్త్ లో ఒవైసీ వ్యూహం.. విస్తరిస్తున్న ఎంఐఎం
Follow us on

19 వ లోక్ సభలో కేవలం ఇద్దరు ఎంపీలతో ‘ అతిపెద్ద పార్టీ ‘ గా అవతరించిన ఎంఐఎం (మజ్లిస్ పార్టీ) మెల్లగా హిందీ బెల్ట్ లో విస్తరిస్తోంది. ఈ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదారాబాద్ ‘ పాతబస్తీ ‘ నుంచి తన పార్టీని క్రమంగా దేశవ్యాప్తం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్కువమంది ఉన్నా సరే.. దేశ రాజకీయాల్లో పరోక్షంగా చక్రం తిప్పుతున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వంటివాటికి ‘ నిద్ర పట్టకుండా ‘ చేస్తున్నారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తన ఉనికి చాటుకుంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సాంస్కృతికంగా హైదరాబాద్ తో లింకు కలిగి ఉండడం ఒవైసీకి కలిసొచ్చింది. మహారాష్ట్రలోని మాలెగావ్ సెంట్రల్, ధూలే సిటీ స్థానాలు ఈ పార్టీ వశమయ్యాయి. రెండు సీట్లలో ఎంఐఎం గెలిచినప్పటికీ.. కనీసం 9 స్థానాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ అభ్యర్థులను ఓడించగలిగింది. ఛండీవలి నియోజకవర్గంలో మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆరిఫ్ నసీం ఖాన్ ని ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ కేవలం 409 ఓట్ల తేడాతో ఓడించారు. భివాండీ వెస్ట్ స్థానంలో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో.. ముస్లిం ఓట్లు చీలిన కారణంగా బీజేపీ అభ్యర్థి ప్రభాకర్ చౌగ్లే గెలుపొందారు. అలాగే ఔరంగాబాద్ సెంట్రల్ లో శివసేన క్యాండిడేట్ ప్రదీప్ జైస్వాల్ విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి నసీరుద్దీన్ సిద్దిఖీ.. ఎన్సీపీ క్యాండిడేట్ అబ్దుల్ ఖాదర్ కి పడాల్సిన మైనారిటీ ఓట్లను చీల్చగలిగారు. అంటే.. అటు కాంగ్రెస్, ఎన్సీపీలకు పడాల్సిన ఓట్లు చీలి.. ఒకవిధంగా బీజేపీ లాభపడింది. (మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే).

ఇక బీహార్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలోని కిషన్ గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి కమ్రుల్ హుదా గెలుపొందారు. హైదరాబాద్ కు సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో గల కిషన్ గంజ్ లోని ముస్లిముల ఓట్లను ఒవైసీ తనకు అనుకూలంగా మలచుకోగలిగారు. ఇక్కడి మైనారిటీలకు తాము అండగా ఉంటామన్న ఆయన హామీ ఎంఐఎం ని విజయం వరించేలా చేసింది. దేశంలోని ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యే ఒక్కరైనా ఉండాలన్నదే ఒవైసీ ఆశయమట. మహారాష్ట్రలోని నాందేడ్ వంటి ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రసంగాలు ముస్లిములను బాగా ఆకట్టుకున్నాయి. ఈ దేశానికి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తూనే ఆయన.. సంఘ పరివార్, వీ హెచ్ పీ వంటి హిందూ సంస్థల విధానాలను విమర్శించారు. ఇక తెలంగాణాలో అధికార టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల దోస్తీ కొత్తేమీ కాదు.