అక్కడికెళ్లి జబర్దస్తీగా జెండా పాతేయొచ్చు.. దేశాధినేత కూడా కావొచ్చు…!!

|

Aug 24, 2020 | 1:02 PM

కైలాసమనే సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానందస్వామిని చూసి ఈర్షపడాల్సిన అవసరం లేదు.. కాసింత వ్యయప్రయాసాలకోరిస్తే మనమూ ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.. మన ప్రత్యేక జెండాను పాతేయొచ్చు.. మనకు మనమే కొత్త దేశానికి అధ్యక్షులం కావొచ్చు..

అక్కడికెళ్లి జబర్దస్తీగా జెండా పాతేయొచ్చు.. దేశాధినేత కూడా కావొచ్చు...!!
Follow us on

కైలాసమనే సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానందస్వామిని చూసి ఈర్షపడాల్సిన అవసరం లేదు.. కాసింత వ్యయప్రయాసాలకోరిస్తే మనమూ ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.. మన ప్రత్యేక జెండాను పాతేయొచ్చు.. మనకు మనమే కొత్త దేశానికి అధ్యక్షులం కావొచ్చు.. అధ్యక్షుడి కంటే రాజంటే బాగుంటుందనుకుంటే ఆ ముక్క కూడా చెప్పుకోవచ్చు.. మనదే ఆ దేశమైనప్పుడు ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు.. ఇదేం జోక్‌ కాదు.. నిజంగానే నిజం..! ఈ భూమ్మీద ఎవరికి చెందని ఓ ప్రదేశం ఉంది.. దాని పేరు బిర్‌ తావిల్‌.. ఈజిప్ట్‌-సుడాన్‌ల మధ్య ఉంటుంది ఇది! సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ నేలను ఎవరూ పట్టించుకోవడం లేదు.. గజం భూమి కోసమే మర్డర్లు జరుగుతున్న ఈ కాలంలో ఇంతేసి భూమి ఉత్తగా పడి ఉండటం ఆశ్చర్యమే..

ఈ నేల మాకు వద్దే వద్దంటూ అటు ఈజిప్ట్‌, ఇటు సూడాన్‌లు మంకుపట్టుపడుతున్నాయి. కారణం ఈ నేలలో గడ్డి కూడా మొలవదు. ఎడారి అన్నమాట! అందుకే ఇక్కడ నివసించడానికి ఎవరూ ఇష్టపడరు.. నిర్మానుష్యంగా ఉంటుంది… పైగా ఈ నేలలోపల ఎలాంటి ఖనిజాలు లేవు.. ఈజిప్ట్‌, సూడాన్‌లు ఇంట్రెస్ట్‌ చూపకపోవడానికి ఇదే కారణం కావొచ్చు.. ఇలా రెండు దేశాలు ఓ ప్రాంతాన్ని అనాథగా వదిలివేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వమే కారణం..

1899లో సూడాన్‌పై పెత్తనం విషయంలో బ్రిటన్‌, ఈజిప్ట్‌ మధ్య ఓ ఒప్పందం జరిగింది.. ఈ ఒప్పందంలో భాగంగా సూడాన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాన్ని ఈజిప్టుకు అప్పగించింది బ్రిటన్‌.. ఆరు నెలల తర్వాత బ్రిటన్‌కు ఏమనిపించిందో ఏమోగానీ ఒప్పందంలో సవరణలు చేసి పాలన బాధ్యతను సూడాన్‌కే అప్పగించింది.. 1902తో బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసింది.. రెడ్‌ సీ తీరంలోని హలయాబ్‌ ట్రాయాంగిల్‌ ప్రాంతాన్ని సూడాన్‌లోని బ్రిటిష్‌ గవర్నర్‌ పాలనలోనే ఉంచేసుకుని… దానికి ఆనుకుని ఉన్న బిర్‌ తావిల్‌ను ఈజిప్ట్‌కు ఇచ్చింది.. ఈజిప్ట్‌కు ఈ పంపకాలు నచ్చలేదు.. హలయాబ్‌ తమకిచ్చేసి .. అవసరమైతే బిర్‌ తావిల్‌ను సూడాన్‌కు ఇచ్చేయమని చెప్పింది.. హలయాబ్‌ను ఇచ్చే ప్రసక్తేలేదని సూడాన్‌ కూడా భీష్మించుకూర్చుంది.. హలయాబ్‌ కోసం కొట్లాడుకుంటున్న ఈ రెండు దేశాలు బిర్‌ తావిల్‌ విషయంలో మాత్రం ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.. ఉపయోగం లేని ఎడారి ప్రాంతం కాబట్టి రెండు దేశాలు బిర్‌ తావిల్‌ను వద్దంటున్నాయి. అలా ఏ దేశానికి చెందని ప్రాంతంగా బిర్‌ తావిల్‌ మారింది.

ఎవరికీ చెందనది కాబట్టి బిర్‌ తావిల్‌కు వెళ్లి మనం జెండా పాతేసుకోవచ్చు.. ఏం జరుగుతుందోనన్న భయమేమీ అక్కర్లేదు.. ఎందుకంటే ఇలాంటి పనులు ఇంతకు ముందు కొందరు చేశారు కూడా! ఆరేళ్ల కిందట వర్జీనియాకు చెందిన జెరెమా హీటన్‌ బిర్‌ తావిల్‌ ప్రాంతం తనదేనంటూ ప్రకటించుకున్నాడు.. ఈజిప్టు మిలటరీ అధికారులు తనకు అనుమతి ఇచ్చారంటూ చెప్పాడు కానీ.. ఐక్యరాజ్య సమితి లైట్‌ తీసుకుంది.. అన్నట్టు ఓ మూడేళ్ల కిందట మన దేశానికి చెందిన సుయాశ్‌ దీక్షిత్‌ కూడా ఇలాగే చేశాడు.. ఆ ప్రాంతానికి వెళ్లి జెండా ఎగరేశాడు.. అది తన రాజ్యమంటూ ప్రకటించుకున్నాడు. దానికి కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌గా పేరు కూడా పెట్టేశాడు.. ఆ ప్రాంతానికి ప్రధానమంత్రిని తానేనని స్టేట్‌మెంట్ ఇచ్చుకున్నాడు.. పాపం దీక్షిత్‌ను కూడా తేలిగ్గా తీసేసుకుంది యూఎన్‌ఓ.