Where Is Achhe Din: 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ, అప్పటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అతి పెద్ద వాగ్దానాల్లో ఒకటి విదేశాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్న నల్లధనాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి ఖాతాల్లోకి రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆ సంవత్సరం ఎన్నికల్లో చాలామంది ప్రజలు ఈ కారణం వల్లే బీజేపీకి ఓటేశారు.
కానీ అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ గత ఐదేళ్ల పాలనలో ఆ హామీనే మర్చిపోయింది. ఇక దీనిపై తరచూ విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ వ్యవహారంపై ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన హెచ్.కె.సింగ్ అనే న్యాయవాది సెక్షన్ 415, 420, 123బీ ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఇక దీనిపై సోమవారం కోర్టు విచారణ చేపట్టగా హెచ్.కె.సింగ్ మాట్లాడుతూ.. ‘తప్పుడు వాగ్దానాలకు ప్రజల నుంచి ఓట్లు పడవని.. కేవలం వారిని మోసం చేయడమే అవుతుందన్నారు. 2019 ఎన్నికల హామీలలో సీఏఏ కూడా ఒకటని అందుకే ఇప్పుడు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారని సింగ్ అన్నారు.
సీఏఏ బీజేపీ మేనిఫెస్టోలోని హామీల్లో ఒకటి కాబట్టే అమలు చేస్తున్నామని చెబుతున్న కేంద్రం అప్పట్లో ప్రతీ ఒక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన హామీ ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు. మరి ఈ విషయంపై అప్పట్లో ఎందుకు కేసు పెట్టలేదని ఆయన్ని న్యాయస్థానం ప్రశ్నించగా.. మిగతా ప్రజల మాదిరిగానే తాను మోసపోయానని హెచ్.కె.సింగ్ వెల్లడించారు.
అయితే 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ఇలాంటి వాగ్దానం ప్రస్తావించలేదని గమనించాలి. అంతేకాక ప్రతి భారతీయుడి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని మోడీ ఎప్పుడూ స్పష్టంగా హామీ ఇవ్వలేదు.