అనంతపురం జిల్లాలో రాజకీయం అంటేనే కత్తిమీద సాము లాంటిది. ఇక్కడ రాజకీయ సమస్యలకు పరిష్కారం చేపట్టాలంటే.. అది అంత ఈజీ కాదు.ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటుంది. ఎదుట ఎవరు ఉన్నా సరే.. నేతల తీరు మాత్రం మారదు. ఈ విషయం వైసీపీ అనతికాలంలోనే అర్థమైంది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత.. జిల్లా అభివృద్ధి మీద మూడు రివ్యూలు జరిగాయి. ఇందులో ఒకటి జిల్లా మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో జరగగా.. మరొకటి మాజీ ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇక మూడవది ప్రస్తుత ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఇలా ముచ్చటగా మూడు రివ్యూ మీటింగ్‌లు జరిగితే.. మూడు మీటింగుల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
అంతకు ముందు జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బిహేవ్ చేశారట. నీటి విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదట. అనంతపురం జిల్లాకు ఉన్న నీటి వనరులు ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి తుంగభద్ర ఎగువ కాలువ అయిన HLC.. కాగా మరొకటి శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా ఏర్పాటైన హంద్రీనీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్రధానమైన ఆధారం. అయితే ఇప్పుడు అన్నీ నియోజకవర్గాలకు నీరు కావాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండటంతో.. అధిష్టానం తలపట్టుకుంటుందట.
ఇటీవలే కొత్తగా ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ.. అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఈ సమావేశంలో తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలంటే.. తమ నియోజకవర్గానికి కావాలంటూ మైకు అందుకుని ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇచ్చారట ఎమ్మెల్యేలు. కాగా, జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలే కావడం విశేషం. కానీ నేతల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకుండా.. ఎవరికి వారు నీటి గురించి డిమాండ్ చేయడంతో.. ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారట. ఎమ్మెల్యేల మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడంతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారని స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తానికి అనంతపురం ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.