
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్రాల మధ్య రాకపోకలు గత నెల రోజులుగా స్థంభించిపోయాయి. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా వున్న రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రాలకు ఎవరూ రాకుండా వుండేందుకు కొన్ని రాష్ట్రాలు చాలా కచ్చితంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు తమ రాష్ట్రానికి ఏపీ నుంచి ఎవరూ రావద్దంటూ ఏకంగా ముఖ్య రహదారులపై ఏకంగా గోడలు కట్టడం వివాదాస్పదమైంది. మనుషుల రాకపోకలను నియంత్రించడానికి చాలా మార్గాలుండగా.. కేంద్రం అనుమతించిన గూడ్స్ వాహనాలు కూడా రాకుండా గోడలు కట్టడమేంటన్న చర్చ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం కావడంతో వారు వెనక్కి తగ్గారు.
కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తాజాగా ఆంధ్ర, తమిళనాడు మధ్య సాగుతున్న అత్యవసర రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సరిహద్దు హైవేలు మూతపడ్డాయి. అప్పటికప్పుడు ప్రధాన రహదారుల్లో భారీ ప్రహారీ గోడలు వెలిశాయి. ఏపీలో కరోనా తీవ్ర ఎక్కువగా ఉంది. తమిళనాడులో మరీ ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోనూ కేసులు అధికంగా నమోదు కావటంతో సరిహద్దు తమిళనాడు అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీ నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే మార్గాలు మూసివేశారు. చిత్తూరు-తిరుత్తణి మార్గంలో శెట్టింతంగాళ్ దగ్గర.. బొమ్మసముద్రం దగ్గర నేషనల్ హైవేపై.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి గుడియాత్తానికి వెళ్లే దారిలో.. రోడ్డుకు అడ్డంగా తమిళనాడు అధికారులు సోమవారం ఉదయం సిమెంటు గోడలు కట్టించారు. ఇలా మూడు చోట్ల రోడ్ల నిర్మాణాలు జరగడంపై కలకలరేపింది.
ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమైన రహదారుల్లో ఇలా గోడలు కట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. తమిళనాడు అధికారుల తీరుపై ఏపీ అధికారులు, స్థానిక పలమనేరు ఎమ్మార్వో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమిళనాడు అధికారులతో ఏపీ అధికారులు చర్చించారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య వస్తు రవాణాకు ఈ గోడల నిర్మాణం అడ్డంకిగా మారింది. దాని వల్ల ఇరు రాష్ట్రాల బోర్డర్ ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయిన రెండు రాష్ట్రాల అధికారులు చర్చించారు. సాయంత్రానికి ఓ అవగాహనకు వచ్చారు.
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డు మీద నిర్మించిన గోడలను కూల్చేశారు తమిళనాడు అధికారులు. గూడియాత్తం, సెట్టింతంగాళ్, బొమ్మ సముద్రం దగ్గర నిర్మించిన గోడలను కూల్చివేసి, గూడ్స్ వాహనాల రాకపోకలకు అనుమతించారు. గోడల నిర్మాణాలపై విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం దిగివచ్చింది. గూడ్స్ వాహనాలు ఆగిపోతే రెండు రాష్ట్రాలు ఇబ్బందులకు గురి అవుతాయన్న అంశాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.