Amit Shah’s Chennai visit : సౌత్ ఇండియాపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంపై ఆపరేషన్ కమల్‌కు శ్రీకారం చుట్టింది. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు . ఈ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. వేలాధిగా తరలి వచ్చిన బీజేపీ కార్యకర్తలతో ఎయిర్‌పోర్టు ముందు సందడిగా మారింది. దీంతో ఆయన ఎయిర్ పోర్టు రోడ్డులో కాలినడకన కార్యకర్తలకు అభివాదం వ్యక్తం చేశారు.
తమిళనాడులో చేపట్టిన 67 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రారంభిస్తున్నారు అమిత్‌షా.. మిత్రపక్షం అన్నాడీఎంకే నేతలతో పొత్తులపై ఆయన కీలక చర్చలు జరుపుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతోంది కమల దళం.
#WATCH Union Home Minister and BJP leader Amit Shah greets BJP workers lined up outside the airport in Chennai pic.twitter.com/15WPgbsQlN
— ANI (@ANI) November 21, 2020
అయితే పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆరునెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డీఎంకే , అన్నాడీఎంకే పార్టీలు పొత్తులపై చర్చలు ప్రారంభించాయి . ఎన్‌డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని బీజేపీ ధీమాతో ఉంది.
అమిత్‌షా ఈ రోజు సాయంత్రం చేపాక్ కళైవా నర్ అరంగంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర శాఖ కార్యాలయం కమలాలయంలో బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులతో సమావేశం కానున్నారు. పార్టీ అభివృద్ధికి, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.
ఈ నేపథ్యంలో కమలాలయం, కళైవానర్ అరంగం, లీలాప్యాలెస్ హోటల్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్టు పోలీసు ఉన్నతా ధికారులు తెలిపారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం కూడా అమిత్‌షా పర్యటించే ప్రాంతాల్లో బందోబస్తు చేపట్టనుంది.