New strain coronavirus: ఇంతకాలం కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే, తాజాగా కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటన్ కేంద్రంగా మొదలైన స్ట్రెయిన్ కరోనా వైరస్.. వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో 16 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. తాజాగా కొత్త రూపం మార్చుకుని భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా చెబుతున్న సైంటిస్టులు.. బ్రిటన్‌లో ముందుగా ఈ వైరస్‌ను గుర్తించారు. వీయూఐ 202012/1 గా పిలుస్తున్న ఈ కొత్త కరోనా వైరస్..ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. బ్రిటన్‌లో ప్రారంభమైన కొద్దిరోజులకే అప్పుడే ఈ వైరస్ అస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లో వ్యాప్తి చెంది.. ఇప్పుడు బారతదేశంలోకి కూడా అడుగుపెట్టింది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో ఈ కొత్త కరోనా వైరస్ వెలుగు చూసింది.
కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వైరస్ భయంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే యూకే నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు చేరుకున్న వారిపై దృష్టి పెట్టింది. ఇదే అంశంపై.. కేంద్ర వైద్య, ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గోవా, పంజాబ్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు యూకే నుంచి చేరుకున్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈ సమీక్షలో స్పష్టమైంది. బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఇప్పటివరకూ 16 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఎయిర్ సువిధ, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు యూకే నుంచి వచ్చిన వారి సమాచారాన్ని అందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో పాజిటివ్‌గా వచ్చిన వారి శాంపిల్స్‌ను స్ట్రెయిన్ వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ల్యాబొరేటరీలకు పంపించాలని అయా రాష్ట్రాలకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సూచించింది. వీరిని దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్న కేంద్రం.. ఎలాంటి లక్షణాలు లేకున్నా రెండు వారాలపాటు ఐసోలేషన్‌లో ఉండాలని కోరింది. వ్యాధి లక్షణాలు, తీవ్రతలో రెండింటికీ తేడా లేకపోయినా సంక్రమణ విషయంలో మాత్రం 70 శాతం వేగంగా విస్తరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే, పూర్తి స్థాయి నివేదిక అందే వరకూ కొత్త కరోనా వైరస్‌పై అధికారికంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు.