ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను వానలు దంచికొడుతున్నాయి. నాలుగురోజులుగా పడుతున్న వానలతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు కాలనీలను వరద ముంచెత్తడంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరగా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది.
కోడేరు మండలంలోని పసులు వాగు పొంగి పొర్లడంతో కోడేరు, జనంపల్లి, తీగలపల్లి, బావాయిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లాపూర్ మండంలోని ముక్కిడిగుండం గ్రామానికి చెందిన పెద్దవాగు, ఉడుముల వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో రోడ్డు కుండిపోయి తెగిపోవడంతో.. లింగంపల్లి తండా, మల్లేశ్వరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముత్తిరెడ్డిపల్లి వాగు సమీపంలోని పొలాల్లో ఉన్న రెండు ట్రాక్టర్లు వాగులో కొట్టుకుపోయాయి.
నాగర్ కర్నూల్ జిల్లా చెర్ల తిర్మాలాపూరం రోడ్డుపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లింగంపెల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల కల్వకుర్తి-నాగర్ కర్నూల్ మధ్య రాకపోకలకు అంటంకంగా మారాయి. కేసరి సముద్రం ప్రస్తుతం నిండుకుండలా మారింది. వరద నీటికి అలుగుపారుతుండడంతో.. అక్కడ చెట్ల పొదల్లో చిక్కుకున్న ఓ కుక్కను గమనించిన పోలీసులు కాపాడారు. ప్రొక్లైనర్ సహాయంతో ఓ హోంగార్డు వాగులోకి దిగి కుక్కను బయటకు తీసుకువచ్చాడు.
జూరాల ప్రాజెక్టు జలసిరితో ఉట్టి పడుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. 24 గేట్లను ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల వరకు దిగువకు నీటిని వదులుతున్నారు. అలాగే కోయిస్ సాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతుండడంతో రెండు గేట్లు ఎత్తారు. రామన్ పాడు ప్రాజెక్టుకు చెందిన తొమ్మిది గేట్లనున కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో వర్షాలకు సుమారు ఇరవై ఇండ్లు కూలిపోయాయి. కుడికిళ్ల గ్రామంలో ఇల్లు కూలి దేవమ్మ అనే వృద్దురాలు మృతి చెందింది. ధన్వాడ మండలంలో ఇల్లు కూలి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన స్థానిక నేతలు ప్రజలను పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
అటు.. వర్షాలకు పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. వేల ఎకరాలు నీట మునిగాయి. దీంతో చేతికొచ్చే సమయంలో పంట వరద పాలు కావడంతో రైతులు కష్టాల వర్ణనాతీతంగా మారాయి. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో పాటు రైతులను ఆదుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.