
ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది. ప్రాణాలనే కాదు లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం తీసుకొచ్చింది. లక్షలాధిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ వైరస్ మహమ్మారి అన్ని దేశాల్లో నష్టాలను తీసుకువచ్చింది. అయితే అక్కడి పౌరులను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని దేశాల్లో ఆర్ధిక నష్టాల్లో నుంచి సామాన్య ప్రజలను బయట పడేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి అక్కడి ప్రభుత్వులు.
అమెరికన్లకు వచ్చే వారం నుంచి కోవిడ్ రిలీఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్నుచిన్ సోమవారం తెలిపారు. యూఎస్‌లో కరోనా మహమ్మారి వల్ల కుదేలైన ప్రజలకు బాసటగా నిలిచేందుకు 900 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు అంగీకారం తెలిపారు.
ఈ ప్యాకేజీ ద్వారా అందిన డబ్బును ప్రజలు ఖర్చు చేసి ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని, తద్వారా చిన్న వ్యాపారాలు కోలుకునేందుకు బాసటగా నిలవాలని మ్నుచిన్ తెలిపారు. నలుగురితో కూడిన కుటుంబానికి 2,400 డాలర్ల కోవిడ్ రిలీఫ్ అందనున్నట్లు ఆయన ప్రకటించారు.