
ఎవరు చెప్పారు..మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్నాయని…ఈ ఘటన గురించి చదివితే కన్నీళ్లతో మీ గుండె చెమ్మగిల్లుతుంది. వారు ముగ్గురు అక్కాతమ్ముళ్లు. ఒకరంటే మరొకరికి వల్లమాలిన ప్రేమ, అభిమానం. 50 ఏళ్ల వయసు పైబడినా కూడా వారి మధ్య ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు. ఈ క్రమంలో వారిలో ఒకరు ప్రాణాలు విడివగానే..ఆ విషయం తెలిసి తట్టుకోలేక మిగతా ఇద్దరు కూడా తనువు చాలించారు. కన్నీరు పెట్టించే ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. కర్ణాటకలోని బెళగావి దగ్గర్లోని పంత్బలేకుంద్రి గ్రామానికి చెందిన అబ్దుల్ మాజిద్ జమదార్(57)కు ఇద్దరు అక్కలు ఉన్నారు. వారి పేర్లు హుస్సేన్ బీ ముల్లా(64), సహారాబీ సనాది(70). వారు చిన్నప్పటి నుంచి ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమతో మెలిగేవారు. కాగా అబ్దుల్ మాజిద్ షుగర్ వ్యాధిగ్రస్తుడు. ఇటీవల అతడికి గుండెల్లో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిర్థారణ రిపోర్టు లేకపోతే ఆస్పత్రుల్లో చేర్చుకోమని చాలా హాస్పిటల్స్ తిప్పి పంపేశాయి.
చివరికి ఎలాగో కష్టాలు పడి మాజిద్‌ను బెలగావిలోని సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి అక్కడ కరోనా టెస్ట్ చేశారు. అయితే రిపోర్ట్ రాకముందే, తీవ్రమైన గుండెనొప్పితో మాజీద్ జమదార్ కన్నుమూశాడు. తర్వాత అతడికి కరోనా నెగిటివ్ అని వచ్చింది. మాజీద్ చనిపోయాడన్న విషయం తెలియగానే చిన్నక్క హుస్సేన్ బీ ముల్లాకు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించింది. పెద్దక్క సహారాబీ సనాది సైతం తమ్ముడి మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.