పాతనోట్ల మార్పిడి అంశాన్ని పరిశీలించండి… : టీటీడీ

|

Sep 15, 2020 | 11:10 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. సర్వీస్‌ ట్యాక్స్‌ మినహాయింపు, హుండీలో పాతనోట్ల వ్యవహారంపై చర్చించారు. టీటీడీ ఎస్పీఎఫ్ విభాగానికి సంబంధించి బకాయిపడ్డ 23 కోట్ల 78లక్షల GST రద్దు చేయాలని కోరారు...

పాతనోట్ల మార్పిడి అంశాన్ని పరిశీలించండి... : టీటీడీ
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. సర్వీస్‌ ట్యాక్స్‌ మినహాయింపు, హుండీలో పాతనోట్ల వ్యవహారంపై చర్చించారు. టీటీడీ ఎస్పీఎఫ్ విభాగానికి సంబంధించి బకాయిపడ్డ 23 కోట్ల 78లక్షల GST రద్దు చేయాలని కోరారు. ఈ రద్దుతో టీటీడీకి మరింత ఆర్థిక బలం లభించి అనేక సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించే అవకాశం కలుగుతుందని సుబ్బారెడ్డి వివరించారు .

ఇక భ‌క్తులు హుండీలో వేసిన 500, వెయ్యి రూపాయల నోట్ల గురించి నిర్మలా సీతారమన్‌కు వివరించారు టీటీడీ చైర్మన్‌. ఆ డబ్బును రిజర్వ్‌ బ్యాంకులోగానీ.. ఇతర బ్యాంకుల్లోగానీ డిపాజిట్‌ చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. నోట్ల రద్దు తర్వాత న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్సహించేందుకు ఎన్నో ఏర్పాట్లు చేశామని వివరించారు. కానీ.. భ‌క్తులు హుండీలో ర‌ద్దయిన నోట్లు కానుక‌గా స‌మ‌ర్పిస్తూ వ‌చ్చార‌న్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం కావ‌డంతో వాటిని నిరోధించే ఏర్పాట్లు టీటీడీ చేయ‌లేక‌పోయింద‌న్నారు వైవీ సుబ్బారెడ్డి.

టీటీడీకి భక్తుల నుంచి వచ్చిన 18కోట్ల రూపాయల విలువైన వెయ్యినోట్లు, 30 కోట్ల 17లక్షల రూపాయల 500నోట్లు కానుకగా వచ్చాయి. హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రికి వివరించారు సుబ్బారెడ్డి. పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి అనేక‌సార్లు విన్నవించినా.. సానుకూల స్పంద‌న రాలేద‌ని గుర్తుచేశారు వైవీ సుబ్బారెడ్డి.