
టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 23వ రోజుకు చేరింది. నిన్న ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె యధావిధిగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్టీసీ జేఏసీ నేతల్లో ఒకరైన రాజిరెడ్డి చేసిన పలు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
తమకు సమ్మె విరమించాలని ఉందని.. ఇదే విషయాన్ని అధికారులకు కూడా చెప్పామని రాజిరెడ్డి అన్నారు. అయితే వారు మాత్రం చర్చలకు సుముఖంగా లేకపోవడంతోనే అర్ధాంతరంగా వచ్చేశామని అన్నారు. ఆర్టీసీ అధికారులు మళ్ళీ ఎప్పుడు చర్చలకు పిలిచినా.. తాము సిద్ధమేనని ప్రకటించారు. ఆర్టీసీలో యూనియన్లే ఉండకూడదని అంటున్న సీఎం కేసీఆర్.. సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేస్తే తప్పకుండా ఆయన కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి మాట్లాడుతూ ‘ఆర్టీసీ అధికారులు అబద్దాలు చెబుతున్నారని.. తాము చర్చల మధ్యలో నుంచి బయటికి రాలేదని.. వారే మధ్యలో వెళ్లిపోయారని’ అన్నారు. వీడియో ఫుటేజ్‌ని పరిశీలిస్తే ఆ విషయం ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. అయితే అధికారులు మళ్ళీ ఎప్పుడు పిలిచినా తాము చర్చలకు సిద్ధమని తెలిపారు. బాధ్యత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు అబద్దాలు చెప్పడం సబబు కాదన్నారు. ఆర్టీసీ సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామని.. ఈ నెల 28న అన్ని కలెక్టరేట్ల వద్ద విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని.. అంతేకాక ఈ నెల 30న సకలజనుల సమరభేరి నిర్వహిస్తామని అన్నారు.