
TS RTC to start Driving Training School : తెలంగాణ ఆర్టీసీ సంస్థ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. వెంటాడుతున్న ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీలోని పరిపాలన విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. నిజానికి ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రకరకాల సమస్యలకు తోడు ‘కరోనా లాక్‌డౌన్’ మరింత దెబ్బ తీసింది. 50 రోజులకుపైగా బస్సులను మూలకు పెట్టాల్సి రావడంతో సుమారు రూ.700 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయిందని అంచనా… ప్రస్తుతం నడుస్తున్న బస్సులతో రూ.5 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో ఆర్టీసీకి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదు.
TS RTC డ్రైవింగ్ స్కూల్..
అయితే ఇప్పటికే కార్గో, పార్శిల్ సేవల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రైవేటు సంస్థలకు పోటీగా వ్యాపారాన్ని నడిపిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ప్లాన్‌ను రెడీ చేసింది. ఓ డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ముందుగా కొత్తగా మూడు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తోంది.
ముందుగా మూడు ట్రైనింగ్ సెంటర్లు…
ఇందులో తేలికపాటి వాహనాలైన కార్లు మొదలు.. భారీ వాహనాల దాకా.. ప్రైవేటు వ్యక్తులకు శిక్షణనిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఒకే బ్యాచ్‌లో ఏకంగా 20 వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యంతో హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
40 రోజుల శిక్షణ.. ఫీజు ఎంతంటే…
దీనిపై ఆర్టీసీలోని పరిపాలన విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ శిక్షణకు ఇంకా ఫీజును నిర్ణయించలేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చి శిక్షణ తీసుకునేవారికి హైదరాబాద్‌లో హాస్టల్ సౌకర్యం కూడా కల్పించే అవకాశాలున్నాయి. దీనికి అదనపు ఫీజు తీసుకుంటారు. 40 రోజుల శిక్షణలో 10 రోజులు థియరీ క్లాసులు, 30 రోజులు ప్రాక్టికల్ క్లాసులుంటాయని అధికారులు అంటున్నారు. ఈ కొత్త ప్లాన్ అద్భుతంగా ఉందంటున్నారు ప్రజలు.