పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కేవలం బిల్లులు పాస్ చేయడం కోసం మాత్రమే నిర్వహించరాదని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్ కరెంటుకు మీటర్లు బిగించే ఎలక్ట్రిసిటీ బిల్లును తాము వ్యతిరేకిస్తామని నామా తెలిపారు. ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి హాజరైన నామా, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులతో పాటు దేశవ్యాప్త సమస్యలు, రాష్ట్రాల ఇబ్బందులపైనా చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. గత కొన్ని నెలలుగా దేశంలో కరోనా కారణంగా అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఆర్థిక పరిస్థితి మందగించడం, నిరుద్యోగం, జీఎస్టీ, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి కీలకాంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల కారణంగా రాష్ట్రాలు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వాటి గురించి చర్చించి పార్లమెంట్ తరఫున రాష్ట్రాల స్థితిగతులను అవగాహన చేసుకోవాలని అన్నారు.