ప్రజా సమస్యల పోరాట యోధుడు… సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సమస్యలపై ఎలుపెరగని పోరాటం చేసిన యోధుడు, నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సమస్యలపై ఎలుపెరగని పోరాటం చేసిన యోధుడు, నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. 30 సంవత్సరాలకు పైగా రాజకీయ, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక తను చాటి చెప్పే వాగ్దాటితో బహుజనం బాగు కోసం పాటు పడాలని నిరంతరం తపించిన బలహీన వర్గాల పెన్నిది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నర్సింహయ్యను..హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో అస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నోముల నర్సింహయ్య మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
1956 జనవరి 9న నకిరేకల్ మండలం పాలెంలో జన్మించారు నోముల నర్సింహయ్య. నకిరేకల్‌లో లాయర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత నకిరేకల్ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు నోముల. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా..శాసనసభాపక్షనేతగా పనిచేశారు. సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయిన ఆయన ఎందరికో తన వంతు స్పూర్తితో కూడిన సందేశాలను ఇచ్చిన ధ్రువతార మరణం
1987 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడు గా ప్రజాప్రతినిధి ప్రస్థానం తొలి అడుగు వేసిన నోముల మరో పర్యాయం అదే స్థానంలో అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు. 1999, 2004లో నకిరేకల్ నుంచి సీపీఎం తరపున పోటీచేసిన నోముల..రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2013లో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు నోముల నర్సింహయ్య. 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై ఘన విజయం సాధించారు నోముల నర్సింహయ్య.
నకిరేకల్ మండలం పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో రేపు (బుధవారం) ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం నోముల భౌతికకాయాన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మండల కేంద్రంలోని ఆయన నివాసానికి ఈరోజు సాయంత్రం వరకు తరలించే అవకాశం ఉంది. రేపు నకిరేకల్‌కు తరలించి పాలెంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నోముల నర్సింహయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నోముల నిలిచిపోతారన్నారు. ఆయన మరణం సాగర్ ప్రజలకు, పార్టీకి తీరని లోటన్న సీఎం కేసీఆర్..నర్సింహయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక పలువురు టీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు నోముల మృతి పట్ల సంతాపం తెలిపారు.
: సీనియర్ నేత, నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య ఆకస్మిక మృతిపట్ల మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం దురదృష్టకరమన్నారు. జీవితాంతం ప్రజలకోసం, వారి హక్కుల కోసం పోరాడారన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిబద్ధతగా పనిచేశారని వెల్లడించారు. నోముల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నోముల నరసింహయ్య ఆకస్మిక మృతిపట్ల రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరనిలోటని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే నోముల మృతిపట్ల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలంపాటు కొనసాగి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అలుపెరుగని పోరాటం చేశారని, సామాన్యుని గొంతుగా పనిచేశారని, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం పాటుపడిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. సీనియర్‌నేత, ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి అకాల మరణం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.