టీజేఎస్ ఛైర్మన్ కోదండరాం, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్. వంశీ కృష్ణ, మోహన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇచ్చిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళుతున్న వీరిని.. నాగర్ కర్నూల్ జిల్లా వెలిగొండ వద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోదండరాం.. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము చట్టాలకు లోబడే వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వలన అక్కడ జీవిస్తున్న ప్రజలకు, వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. అంతేకాకుండా.. పర్యావరణానికి, జంతువులకు ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో యురేనియం తవ్వకాలను నిషేధిస్తుంటే.. మనదేశంలో వీటికి కొత్తగా అనుమతులు ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.