చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పలడ్డరన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉచ్చు బిగిస్తోంది. మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ చట్ట ఉల్లంఘనపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది.
సోనియా గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు సంబంధించిన నిధుల విషయంలో మనీ లాండరింగ్, ఎఫ్ఆర్‌సీఏ, ఐటీ చట్టాలను ఉల్లఘించారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ట్రస్టుల సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు కేంద్రం ఓ అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. దీంతో పాటు సీబీఐ కూడా ఇందులో భాగంగా ఉంటుందని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కమిటీ వివరాలను కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు.
కాగా ఆర్‌జీఎఫ్‌కు సోనియా గాంధీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి.చిదంబరంలు ట్రస్టీలుగా ఉన్నారు. ఇక రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌లకు కూడా సోనియా గాంధీ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. యూపీఏ హయాంలో సదరు ఫౌండేషన్, ట్రస్ట్‌లకు వచ్చిన విరాళాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కేంద్రం స్పందించి ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీకి సంబంధించి విధివిధానాలు ఖరారు కావల్సివుంది.
ఎంహెచ్ఏ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ ద్వారా స్పందించారు. ప్రపంచం తనలాగే ఉందని మోదీ భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికి ఓ రేటు ఉంటుందని, బెదిరించవచ్చని మోదీ భావిస్తున్నాడని మండిపడ్డారు రాహుల్. సత్యం కోసం పోరాడేవారిని బెదిరించలేరన్న విషయం ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేరని ట్వీట్టర్ వేదికగా రాహుల్ అన్నారు.
Mr Modi believes the world is like him. He thinks every one has a price or can be intimidated.
He will never understand that those who fight for the truth have no price and cannot be intimidated.
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2020
అయితే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు ట్రస్టులు కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఆదాయపు పన్ను చట్టం, విదేశీ సహాయ నియంత్రణ చట్టం ఉల్లంఘనలకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఎంహెచ్ఏ వెబ్‌సైట్ ప్రకారం, మూడు ట్రస్ట్ లు విదేశీ విరాళాలను స్వీకరించడానికి ముందస్తు అనుమతి అవసరమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అసోసియేషన్ కూడా కాదని వెల్లడించింది.
అయితే, 2006 మరియు 2009 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుండి ఆర్‌జిఎఫ్ నిరంతరం విరాళాలు అందుతోందని ఇటీవల అధికార భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రత్యేక కమిటీ ద్వారా విచారణకు కేంద్రం ఆదేశించింది.