Assets Registration: ప్రవాస భారతీయులకు శుభవార్త వినిపించారు సీఎం కేసీఆర్. అయితే ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్ కార్డులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ స్థానంలో పాస్‌పోర్టును ప్రామాణికంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటి వరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాల్లో ఏర్పడే ట్రైబ్యునళ్లలో పరిష్కరించాలన్నారు. రెవెన్యూ పనులన్నీ కలెక్టర్లే చేయాలని, ఈ అంశాలను కింది స్థాయి అధికారులకు అప్పగించి, చేతులు దులుపుకోవద్దని సూచించారు.
కోర్టు కేసులు మినహా పార్ట్-బీలో చేర్చిన అంశాలన్ని కలెక్టర్లు పరిష్కరించాలన్నారు. సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించి ఆమోదించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని, దీని వల్ల ఘర్షణలు, వివాదాలు జరిగేవన్నారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణలతో భూ యాజమాన్యం విషయంలో స్పష్టత వస్తోందని అన్నారు.
అలాగే భూరికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ధరణిపోర్టల్ వందశాతం విజయవంతం అయిందని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటుకు ధరణిపోర్టల్‌లో అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అయితే ధరణి పోర్టల్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని, ఎన్నారైలకు ఆధార్ స్థానంలో పాస్‌పోర్టు నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లకు వీలు కల్పించాలన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్‌ను వెంటనే నిర్వహించాలన్నారు. అలాగే కంపెనీలు సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్‌బుక్ ఇవ్వాలన్నారు. గతంలో ఆధార్ కార్డు నంబర్ ఇవ్వనివారికి మరోసారి అవకాశం కల్పించాలన్నారు.