ఏపీలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. పార్టీలో ఎవరు కొనసాగుతారో .. ఎవరు బయటకు వెళ్లిపోతున్నారో అర్ధంకాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. అప్పటినుంచి పార్టీ మారేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన లేఖను బుధవారం శాసనమండలి కార్యదర్శికి సమర్పించారు.
ఇదిలా ఉంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత టీడీపీ అధినాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. మాజీ మంత్రి లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమికి లోకేశ్ వ్యవహార శైలి కారణమని ఆరోపించారు. ఆయన కనీసం వార్డుమెంబర్ కూడా కాలేకపోయినా..ఆయనకు అడ్డదారిలో మంత్రిపదవిని కట్టబెట్టారని ఫైరయ్యారు. లోకేశ్ పార్టీలోకి వచ్చిన తర్వాత గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారని ఆరోపించారు. త్వరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలతో టీడీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు ధ్వజమెత్తారు సతీష్.