TDP Atchannaidu: అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతాం.. అధికారుల చిట్టా తయారు చేస్తున్నాం

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, దేవతా మూర్తుల విధ్వంసం అనంతరం రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి..

TDP Atchannaidu: అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతాం.. అధికారుల చిట్టా తయారు చేస్తున్నాం

Updated on: Jan 20, 2021 | 3:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, దేవతా మూర్తుల విధ్వంసం అనంతరం రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైకాపా, ప్రతిపక్షం టీడీపీ మధ్య నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు, వ్యక్తిగత దూషణలతో రాజకీయంగా యుద్ధ వాతావరణం నెలకొంది.

ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. సీఎం జగన్ తో పాటు మంత్రులే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా పోలీసులకూ వార్నింగ్‌ ఇవ్వడం సంచలనంగా మారింది.

వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీకి డీజీపీ అధికార ప్రతినిధిగా మారిపోయారని విమర్శించారు. దేవాలయాలపై దాడులు చేసింది టీడీపీ కార్యకర్తలేనని నిరూపించాలని డీజీపీకి సవాల్‌ విసిరారు. తమను టార్గెట్ చేసిన అధికారులు, పోలీసుల చిట్టా తయారువుతోందని.. అధికారంలోకి వచ్చాక వారి పనిపడతామని హెచ్చరించారు. తప్పు చేసిన అధికారులను ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో దాడులపై త్వరలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.