వికారాబాద్ జిల్లా తాండూరులో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై ప్రసంగం విషయంలో నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ముందే ఘర్షణకు దిగారు. తాండూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో యాలాల మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఏఎంసీ ఛైర్మన్ విఠల్ నాయక్, వైస్ ఛైర్మన్ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
అయితే ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సమావేశం ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఏఎంసీ ఛైర్మన్ విఠల్ నాయక్‌కు మైక్ అందిస్తుండగా.. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రా శ్రీనివాస్ రెడ్డి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ కలగజేసుకొని సిద్రా శ్రీనివాస్ రెడ్డికి మైక్ ఇవ్వాలని చెప్పారు. రెండు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తానని అప్పటి వరకు ఆగాలని విఠల్ చెప్పారు. అయితే ఇది యాలాల మండల పార్టీ సమావేశమని…నువ్వు తాండూరు మండలానికి చెందిన నీకు ఇక్కడేం పని అని ఎదురు తిరిగారు. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో సమావేశం రసాభాసాగా మారింది.
ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ నచ్చజెప్పడంతో సిద్రా శ్రీనివాస్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో పార్టీలోకి కొందరు కొత్త బిచ్చగాళ్లు వచ్చారని అనడంతో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అడ్డుకున్నారు. రెండు రోజులుగా సమావేశాలుల జరుగుతున్నా… మండల అధ్యక్షుడిగా పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడొచ్చి గొడవ చేయడం ఏంటని నిలదీశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నచ్చజెప్పుతూ సమావేశాన్ని ముగించారు. మొత్తానికి తాండూరు అధికార పార్టీ నేతల్లో చెలరేగిన వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read more: