స్వామి చిన్మయానంద.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మరో స్వామీజీ ఈయన. స్వామీజీ ముసుగులో యువతిపై అఘాయిత్యానికి పాల్ప్డ ఆయనను ప్రస్తుతం సంత్ సమాజ్ నుంచి బహిష్కరించాలని అఖిల భారతీయ అఖారా పరిషత్ (ఏబీఏపీ) నిర్ణయించింది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈ స్వామిపై లైంగిక వేధింపుల కేసు వెంటాడుతోంది. తనకు లా కాలేజీలో సీటు ఇప్పించడంలో, లైబ్రరీలో ఉద్యోగం ఇప్పించడంలోనూ స్వామి సహకరించి ఆపై తనను వంచించి ఏడాది కాలంపాటు లైంగికంగా వేధించినట్టు న్యాయ విద్యార్దిని ఆరోపిస్తోంది. అయితే ఈ కేసులో అరెస్టయిన స్వామి కూడా తాను తప్పు చేసినట్టు అంగీకరించినట్టు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహజాన్‌పూర్ కోర్టు ఆయనకు 14 రోజుల కస్టడీకి అప్పగించింది.
మొట్టమొదట సంత్ సమాజ్‌కు చెందిన ఓ వ్యక్తి తనను, తన కుటుంబాన్ని అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఈ కేసులో బాధితురాలు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసులో స్వామి చిన్మయానంత పేరు మొదట బయటకు రాలేదు.. ఫేస్‌బుక్ పోస్ట్ తర్వాత ఆగస్టు 24 నుంచి యువతి కనిపించలేదు. ఆమెను కిడ్నాప్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆమె రాజస్థాన్‌లో కనిపించింది. అదే రోజు సుప్రీం కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు హాజరై తన బాధనంతా వెల్లడించింది.
ప్రస్తుతం ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా సంత్ సమాజ్ మాత్రం స్వామి చిన్మయానంద్‌ను తమ సమాజం నుంచి బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చింది. వచ్చేనెల 10 న సమావేశమై దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. స్వామి తాను నిర్దోషిగా తేలే వరకు ఆయనపై బహిష్కరణ వేటు కొనసాగుతుందని సంత్ సమాజ్ వర్గాలు వెల్లడించాయి.