బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా వివరాలను తెలుసుకోగోరుతూ ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. అయితే ఈ లేఖను పీఎంఓ…. సీబీఐకి పంపడంతో ఆ దర్యాప్తు సంస్థ తిరిగి స్వామికి లేఖను పంపింది. ఈ కేసులో అన్ని అంశాలనూ తాము ఇన్వెస్టిగేట్ చేశామని, దేనినీ తోసిపుచ్చలేదని వెల్లడించింది. సుశాంత్ ది హత్య కాదని, సూసైడ్ అని ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ల బృందం గత అక్టోబరులోనే అభిప్రాయపడిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు ఆయనను విషమిచ్చి హతమార్చారనో, గొంతు నులిమి చంపారనో చెప్పడానికి ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారన్నారు. మేం ఏ కేసులో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నాం, డిజిటల్ సాధనాల్లో లభ్యమైన డేటాను బట్టి ఏ అంశాన్నీ వదలలేదు. అలాగే ఈ కేసుకు సంబంధించి సెల్ టవర్ లొకేషన్ల డేటాను కూడా విశ్లేషించాం అని సీబీఐ ఈ లేఖలో వివరించింది. తమ అధికారుల బృందం అలీఘడ్, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, మానేసార్ ,తదితర ప్రాంతాలను కూడా విజిట్ చేశారని, అన్ని ఆధారాలూ సేకరించారని సీబీఐ వెల్లడించింది.