ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల, కాంటినెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. సూపర్‌స్టార్ కృష్ణకు విజయనిర్మల భార్య. నటుడు నరేష్‌కి తల్లి. విజయనిర్మల మృతితో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికిని వ్యక్తం చేస్తున్నారు.
నటిగా దర్శకురాలిగా తనదైన బాణిని పలికించారు. 44 పైగా చిత్రాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా ఆమె గిన్నీస్ రికార్డు సాధించారు. విజయనిర్మల బాల్యంలో పాండురంగ మహత్యం చిత్రంలో బాలకృష్ణుడిగా నటించి వావ్ అనిపించారు.
రంగుల రాట్నం చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా మారారు. మీనా చిత్రం ద్వారా దర్శకురాలిగా మారారు. భార్యాభర్తలిద్దరూ కలిసి 50 చిత్రాల్లో నటించారు. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు వంటి చిత్రాలు రజతోత్సవాలు కూడా జరుపుకున్నాయి.
విజయనిర్మల అసలు పేరు నిర్మల. అయితే తనకు సినీ రంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని ఆమె పేరు మార్చుకున్నారు. బాలనటిగా కేరీర్ ప్రారంభించిన విజయనిర్మల అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత మెగాఫోన్ చేపట్టి అత్యధిక సినిమాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్‌బుక్‌లో స్థానం సాధించారు.
సాక్షి చిత్రంలో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఆమె నటించారు. తెలుగు, తమిళం, మలయాళంలో 200లకు పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణా పతాకంపై 15కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు వంటి చిత్రాలలో ఆమె అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నారు.