రాజధాని కోసం రాయలసీమలో మళ్లీ ఉద్యమం మొదలైంది. హైకోర్టు కూడా కావాలంటూ విద్యార్ధులు ఆందోళనలు చేపట్టారు. సీమలో ఒక్కసారిగా వాయిస్ పెరగడానికి కారణమేంటి? అసలు స్టూడెంట్స్ ని వెనక ఉండి నడిపించేదెవరు? ప్రత్యేక రాజధాని, హైకోర్టు ఉద్యమాల వెనుక ఉన్నది ఎవరు?
ఏపీలో రాజధాని కోసం, హైకోర్టు కోసం కర్నూలులో విద్యార్ధుల ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అమరావతిపై కొందరు మంత్రులు ప్రకటనలు చేసిన మర్నాడు నుంచి విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేదని, తిరిగి రాజధానిని కర్నూలుకే తరలించాలిని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.తమ జీవతాలు బాగుపడాలంటే హైకోర్టును రాయలసీమకు తీసుకురావాలని నినాదాలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో విద్యార్ధులు ఈ ఉద్యమం స్వచ్ఛందంగా చేస్తున్నారా.. లేక వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. విద్యార్ధుల ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆర్ధిక వనరులు కావాలి. విద్యా సంస్థల యజమానులు కూడా సహకరించాలి. ఇవన్నీ స్టూడెంట్స్ కి ఎవరు సమకూరుస్తున్నారు? అనే చర్చలు మొదలయ్యాయి.
విద్యార్ధుల ఉద్యమం వెనుక ఇటీవల బీజేపీలో చేరిన ఓ ఎంపీ ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమానికి పరోక్షంగా ఆయన సహకరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. రాయలసీమ డిక్లరేషన్ లో భాగంగానే బీజేపీ నేతలు ఈ ఉద్యమానికిక మద్దతిస్తారనేది ఓ వాదన. వైసీపీ నేతలే కొందరు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నారనేది మరో వాదన. అయితే అధికార పార్టీ నేతలే ఉంటే వారి ఇళ్లను ఎందుకు ముట్టడిస్తారని కొందరంటున్నారు.
ఇది ఇలా ఉంటే, విద్యార్ధులు మాత్రం తమ వెనుక ఎవరూ లేరంటున్నారు.తమ ఉద్యమానికి ఎవరి సహకారం అవసరం లేదని, తమకు జరిగిన అన్యాయం నుంచే ఉద్యమం పుట్టిందని చెబుతున్నారు. తమ ఉద్యమాన్ని ఎవరి పాదాల దగ్గర తాకట్లు పెట్టాల్సిన అవసరం తమకు లేదంటున్నారు.