రాజకీయ పార్టీలకు ఈసీ కొత్త మార్గదర్శకాలు.. నిబంధనలకు విరుద్ధ ప్రసంగాలపై చర్యలు తప్పవుః ఎస్ఈసీ

|

Nov 27, 2020 | 10:15 PM

రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల వేళ పలువురు నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలను విడుదల చేసింది.

రాజకీయ పార్టీలకు ఈసీ కొత్త మార్గదర్శకాలు.. నిబంధనలకు విరుద్ధ ప్రసంగాలపై చర్యలు తప్పవుః ఎస్ఈసీ
Follow us on

రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల వేళ పలువురు నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడంతో పాటు నిరాధార ఆరోపణలు, నిబంధనలకు విరుద్ధంగా చేసే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సి. పార్ధసారథి అన్నారు. పార్టీలు, అభ్యర్థులు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా ప్రసంగించవద్దని సూచించారు. గ్రేటర్‌ హైదారబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్ధసారథి మాట్లాడుతూ.. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నందున ఏర్పాట్లు జాగ్రత్తగా చూడాలన్నారు. ఎక్కడ పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా చూడాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఏ కారణాల వల్ల కూడా రీపోలింగ్‌ జరిగే అవకాశం రాకుండా చూసుకోవాలన్నారు. అలాగే, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 29 నాటికి ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షం వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

అలాగే, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా అధికారుల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద వీల్‌ చైర్లు, ర్యాంపులు ఉండేలా చూడాలన్నారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పర్యవేక్షించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా చూడాలన్నారు.