కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నియామకాలకు సంబంధించి ఆమె సరికొత్త సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తనకు రాసిన 23 మంది ‘అసమ్మతివాదులను’ పక్కన పెట్టాలని ఆమె తీర్మానించారని సమాచారం. నేడు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసినట్టు తెలుస్తోంది.
పార్టీ చీఫ్ విప్ గా సోనియా జైరాం రమేష్ ని నియమించడమే గాక,, రాజ్యసభలో తలెత్తే అంశాల పరిశీలనకు తన విధేయులైన అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ఈ పార్టీ సభ్యులుగా ఉంటారు. దీంతో రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మలను ఆమె పక్కన పెట్టినట్టయింది.
సోనియా గాంధీ లోక్ సభలో కూడా ఈ విధమైన కమిటీనే నియమించారు. డిప్యూటీ లీడర్ గా గౌరవ్ గొగోయ్ ని, విప్ గా రణ్ బీత్ సింగ్ బిట్టును ఆమె నియమించారు. వీరిద్దరూ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. అసమ్మతివాదులుగా ముద్ర పడిన వారి లేఖ పర్యవసానంగా సోనియా తీసుకున్న ఈ నిర్ణయాలు పార్టీలో మరెన్ని మార్పులకుడ్ దారి తీస్తాయో చూడాలి.