ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉరేసుకొని చనిపోయారని ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని చెప్పారు. శవపరీక్ష కోసం ఆయన భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు. కోడెలను ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారని సోమిరెడ్డి తెలిపారు. వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారని, ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన కన్నుమూశారని వెల్లడించారు. ఫౌండర్, ఛైర్మన్‌గా ఉన్న ఆస్పత్రిలోనే ఆయన చనిపోవడం బాధాకరమన్నారు.
వైసీపీ వేధింపుల వల్లే కోడెల మృతి:
వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తన చివరి శ్వాస వరకు కోడెల టీడీపీ కోసం పరితపించారని అన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. వ్యక్తిగతంగా ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.