Online Loan Apps : ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేంటి..? యువ ఇంజనీర్‌ను మింగేసిన ఆన్‌లైన్ లోన్ యాప్స్

|

Dec 18, 2020 | 7:52 AM

డబ్బు అవసరం వచ్చింది కదా అని ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ని ఆశ్రయిస్తున్నారా..? తాకట్టు ఏమి పెట్టకుండానే డబ్బు ఇస్తామంటున్నారా..? నమ్మి సదరు ఆన్‌లైన్ లోన్‌ యాప్‌లను ఆశ్రయిస్తే మీరు చిక్కుల్లో పడ్డట్లే.

Online Loan Apps : ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేంటి..? యువ ఇంజనీర్‌ను మింగేసిన ఆన్‌లైన్ లోన్ యాప్స్
Follow us on

డబ్బు అవసరం వచ్చింది కదా అని ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ని ఆశ్రయిస్తున్నారా..? తాకట్టు ఏమి పెట్టకుండానే డబ్బు ఇస్తామంటున్నారా..? నమ్మి సదరు ఆన్‌లైన్ లోన్‌ యాప్‌లను ఆశ్రయిస్తే మీరు చిక్కుల్లో పడ్డట్లే. వారు వేసే ఇంట్రస్ట్ రేటులకు మీ మైండ్ బ్లాంక్ అవుద్ది. వాటిని తీర్చాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. కర్మ కాలి చెల్లింపుల విషయంలో కాస్త లేటు చేశారా..మిమ్మల్ని మానసికంగా హింసిస్తారు. ఆన్‌లైన్ లోన్లు తీసుకుంటున్నప్పుడే వారు మీ కాంటాక్టుల యాక్సెస్ తీసుకుంటారు. పేమెంట్ కాస్త లేటయితే..మీ సన్నిహితులకు ఫోన్ చేసి..మిమ్మల్ని ఓ డిఫాల్డర్ అని చెబుతారు. మీ సన్నిహితులకు పదే, పదే సందేశాలు పంపుతారు. చివరకు లీగల్ నోటీసుల కూడా సెండ్ చేస్తారు. ఈ ఒత్తిళ్ల కారణంగా యువత ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలా చూశాం. తాజాగా ఆన్‌లైన్‌ అప్పులకు మరో వ్యక్తి బలయ్యాడు. అయితే అతడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వడం విస్మయం కలిగించే అంశం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన సునీల్‌(29) రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో వైఫ్‌తో కలిసి నివశిస్తున్నాడు. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నారు. అయితే కొంతకాలంగా సునీల్ ఆన్‌లైన్‌లోని పలు యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుని తిరిగి రోజుల వ్యవధిలోనే చెల్లించేవారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందుల చుట్టుముట్టడంతో యాప్‌ల నుంచి  తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో ఆయా యాప్‌ల నిర్వాహకులు భారీ వడ్డీలు జమకడుతూ అతడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అంతే కాదు..అతడో డిపాల్టర్ అంటూ ఆయనకు సంబంధించిన ఫోన్‌ కాంటాక్టులన్నింటికీ సందేశాలను పంపుతూ వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన సునీల్‌ బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.  గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కుటుంబసభ్యుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఆన్‌లైన్ లోన్ యాప్స్ కారణంగా యువత ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల తరుచుగా చూస్తున్నాం. అయినా కానీ వీటిపై అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

Also Read : పాపం పసివాడు.. నాన్న జైల్లో.. అమ్మ ఎక్కడో తెలియదు.. పుట్‌పాత్‌పై కుక్కతో పడుకుంటున్న..