పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని వకీల్ పల్లి గనిలో సంభవించిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. శిథిలాల క్రింద కూరుకుపోయిన ఓవర్ మెన్ రాపోలు నవీన్ కుమార్ దుర్మరణం పాలయ్యాడు.
ఆర్ జీ – 2 ఏరియా వకీల్ పల్లి గనిలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పైకప్పు కూలింది. త్రీ సీమ్, 66వ లెవల్,41 వ డీప్ నార్త్ జంక్షన్ వద్ద సంభవించిన ఈ ప్రమాదం నుండి ఆపరేటర్ సతీష్ సహా ఆరుగురు కార్మికులు సురక్షితంగా బయటపడగా.. ఓవర్ మెన్ రాపోలు నవీన్ కుమార్ బండ కిందే కూరుకుపోయాడు. కార్మికులు అందించిన సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది తెల్లవారుజాము వరకు బండ తొలగింపు పనులు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బండ కింద నవీన్ కుమార్ విగతజీవిగా లభ్యమయ్యాడు. మృతదేహాన్ని అధికారులు గోదావరిఖని లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
కాగా, 28 సంవత్సరాల వయస్సు గల నవీన్ కుమార్ కు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. నవీన్ మృతి చెందాడన్న విషయం తెలిసి ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఊహించని రీతిలో క్షణాల్లోనే ఈ ప్రమాదం సంభవించిందని, బండ కింద కూరుకుపోయిన నవీన్ కుమార్ ను కాపాడుకోలేకపోయామని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. రక్షణ చర్యలను మెరుగుపరచడం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని వీడక పోతుండడం దుర్మార్గమని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.