AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌ నుంచి కరీంనగర్ వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. త్వరలో హైస్పీడ్ కనెక్టివిటీ!

హైదరాబాద్- కరీంనగర్‌ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రూట్‌లో కోత్తగా రైల్వే ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చే ఆలోచన చేస్తోది రైల్వే శాఖ. ఉత్తర తెలంగాణ ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు సికింద్రాబాద్-కరీంనగర్ మధ్య ప్రత్యేక రైలు నడపాలని చూస్తోంది.

Telangana: హైదరాబాద్‌ నుంచి కరీంనగర్ వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. త్వరలో హైస్పీడ్ కనెక్టివిటీ!
Secunderabad Karimnagar Rapid Rail
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 21, 2026 | 12:58 PM

Share

హైదరాబాద్‌లో జీవనోపాధి వెతుక్కుంటూ వచ్చిన ఉత్తర తెలంగాణ వాసులకు ప్రయాణ భారం తగ్గించే దిశగా ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వస్తోంది. నగరంలో ఉద్యోగాలు చేసేవారు, చదువుకునే విద్యార్థులు, వ్యాపారులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రస్తుతం రోడ్డు మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ట్రాఫిక్‌ రద్దీ, బస్సు ఛార్జీలు, ప్రయాణ సమయం వెరసి సొంతూరి ప్రయాణాన్ని భారంగా మారుస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సికింద్రాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు పెద్దపల్లి, కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు నడపాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు లేదా మెము సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి.

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులే ప్రధాన ఆధారం. సాధారణ రోజుల్లోనూ ఈ మార్గంలో బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ నగరంలోని ట్రాఫిక్‌, మార్గమధ్యంలో రద్దీ కారణంగా గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పడుతోంది. సాధారణ బస్సుల్లో టికెట్‌ ధర రూ.220 నుంచి ప్రారంభమవుతుండగా, సౌకర్యవంతమైన సర్వీసుల్లో మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. పండగలు, సెలవు రోజుల్లో రద్దీ పెరిగితే ముందస్తు బుకింగ్‌ లేకుండా ప్రయాణం చేయడం కష్టమవుతోంది.

అదే రైలు ప్రయాణం అయితే తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని భావించినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్వీసులు ఆశించిన ప్రయోజనాన్ని ఇవ్వడం లేదు. కరీంనగర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే డెమూ రైలు జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, మేడ్చల్‌ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణిస్తోంది. సుమారు 309 కిలోమీటర్ల దూరం చుట్టివచ్చేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతోంది. నిజామాబాద్‌–మేడ్చల్‌ మధ్య సింగిల్‌ లైన్‌ ఉండటంతో పాటు వేగపరిమితి కూడా తక్కువగా ఉండటం ప్రయాణ వ్యవధిని పెంచుతోంది. దీంతో తక్కువ సమయంలో చేరుకోవాలనుకునే వారు తప్పనిసరిగా బస్సులనే ఆశ్రయిస్తున్నారు.

ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా పెద్దపల్లి–కాజీపేట–సికింద్రాబాద్‌ మార్గాన్ని వినియోగించుకోవచ్చని ప్రతిపాదకులు సూచిస్తున్నారు. ఈ మార్గంలో ఇప్పటికే పలు రైల్వే మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పెద్దపల్లి నుంచి కాజీపేట వరకు మూడో లైన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కాజీపేట నుంచి ఘట్‌కేసర్‌ వరకు రెండో లైన్‌, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ వరకు నాలుగో రైల్వే లైన్‌ సదుపాయం ఉంది.

ఈ మార్గంలో పెద్దపల్లి నుంచి సికింద్రాబాద్‌ వరకు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే సామర్థ్యం ఉందని ప్రతిపాదకులు చెబుతున్నారు. కరీంనగర్‌–పెద్దపల్లి మధ్య ఉన్న 35 కిలోమీటర్ల సింగిల్‌ లైన్‌లోనూ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు సర్వీసును ప్రవేశపెడితే ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌, పెద్దపల్లి మీదుగా కరీంనగర్‌కు నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు లేదా మెము సర్వీసును ప్రవేశపెట్టాలన్నది ప్రధాన డిమాండ్‌. ప్రతిపాదిత మార్గంలో రైలు నడిస్తే సుమారు మూడు నుంచి నాలుగు గంటల్లో కరీంనగర్‌కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే నగర తూర్పు ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతో వెసులుబాటు కలుగుతుంది. ఘట్‌కేసర్‌, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ పరిసరాల్లో ఉండేవారు తమకు దగ్గరలోని స్టేషన్ల నుంచి ప్రయాణం ప్రారంభించవచ్చు. నగరంలోని ప్రధాన బస్టాండ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రైల్వే మార్గంలోనే స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తర తెలంగాణ కుటుంబాలకు వారాంతాల్లో సొంతూళ్లకు వెళ్లడం సాధారణం. ముఖ్యంగా విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు తరచూ ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. రోడ్లపై వాహనాల రద్దీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

కరీంనగర్‌, పెద్దపల్లి, కాజీపేట ప్రాంతాలకు హైదరాబాద్‌తో రవాణా అనుసంధానం మెరుగుపడితే విద్యా, వైద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లోనూ ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రైల్వే మార్గాలను సమర్థంగా వినియోగించుకుంటూ కొత్త సర్వీసును తీసుకురావాలని కోరుతున్నారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ప్రయాణ సమస్యకు రైల్వే శాఖ ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us