కరోనా ప్రభావంతో క్రెడిట్ కార్డుల బిల్లుల కట్టలేనివారికి త్వరలోనే ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. లాక్ డౌన్ సమయంలో ఇచ్చిన మారటోరియం గడువును పొడిగించే ఆలోచనలో ఉంది. ముగిసినా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారులకు మరింత గడువు ఇవ్వాలని ఎస్‌బీఐ కార్డ్స్ భావిస్తోంది. చెల్లింపుల్లో విఫలమైన ఖాతాదారులు.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన రుణ పునర్ వ్యవస్థీకరణ పథకం… కంపెనీ ప్రకటించిన రీపేమెంట్ గడువును ఎంచుకోవచ్చని ఎస్‌బీఐ కార్డ్స్ ఎండీ, సీఈఓ అశ్వినీ కుమార్ తివారీ వెల్లడించారు. రెండింటిలోనూ ఆకర్షణీయమైన ‘వడ్డీ’ రేటు ఉంటుందని అన్నారు.
అయితే కంపెనీ ప్రకటించే రీపేమెంట్ పథకాన్ని ఎంచుకుంటే.. మారటోరియం గడువు ముగిసినా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారుల వివరాలు ‘సిబిల్’కు చేరవన్నారు. అలా చేయడం వల్ల వారి పరపతి రేటింగ్‌కు ఎలాంటి ఢోకా ఉండదని తివారీ చెప్పుకొచ్చారు. ఇది క్రెడిట్ కార్డు హోల్డర్లకు పెద్ద గుడ్ న్యూస్ గా పరిగణించవచ్చు.
కరోనా నేపథ్యంలో భవిష్యత్ ఇంకా అనిశ్చితంగా ఉందని తివారీ అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి లేక వచ్చే ఏడాది ప్రారంభానికి పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నామన్నారు. సెప్టెంబరుతో ముగిసే రెండో త్రైమాసికం కష్టంగానే ఉంటుందన్నారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఎన్‌పీఏ (NPA)ల భారంతో కేటాయింపుల పోటు తప్పకపోవచ్చన్నారు.