శబరిమలలో కొలువుతీరిన హరిహరుల పుత్రుడు అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కరోనా నేపథ్యంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కాగా నవంబర్ 16 నుంచి డిసెంబరు 27 వరకు మండల మహోత్సవం…డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు మకర విళక్కు మహోత్సవం జరగనున్నాయి. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో భక్తుల సంఖ్య కోటి వరకు ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా రోజుకు 2,000 మంది, శని, ఆదివారాల్లో 3,000 మందికి మాత్రం అవకాశం కల్పిస్తూ టెంపుల్ బోర్డు, కేరళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నాయి. తిరుముడి ఉంటే, ఏదోవిధంగా అనుమతిస్తారన్న భావనతో వెళ్తున్న భక్తులను పోలీసులు వెనక్కి పంపేస్తున్నారు.
శబరిమల వెళ్లాలనుకునే భక్తులు కొవిడ్ టెస్ట్ చేయించుకోని, లేదని తేలినవారు మాత్రమే దర్శానానికి రావాలని కేరళ ప్రభుత్వం కోరింది. రోడ్డుమార్గాల్లో వెళ్లేవారిని ఆ రాష్ట్ర బార్డర్స్‌లో.. ఇంకా రైల్వేస్టేషన్‌లో, విమానాశ్రయాల్లో నిలిపి కోవిడ్ సర్టిఫికేట్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. శబరిమల ఆన్‌లైన్ డాట్ ఆర్గ్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వర్చువల్ క్యూ ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫోన్ నంబరు నమోదు చేసుకుని పంపుతున్నారు. కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ లేకుంటే రూ.625 తో అక్కడే టెస్ట్ చేసి.. నెగెటివ్‌గా తేలితేనే అనుమతిస్తున్నారు. అయితే వేర్వేరు మార్గాల్లో పంబకు చేరే వీలున్నందున, ప్రైవేటు వాహనాలు పార్కింగు చేసే నీలక్కల్‌కు 20 కిలోమీటర్ల ముందు, నీలక్కల్ నుంచి పంబకు వెళ్లే బస్టాండు వద్ద, పంబ నుంచి శబరి నడకయాత్ర ప్రారంభమయ్యే గణపతి ఆలయం వద్ద కూడా ఈ పరిశీలనలు జరుగుతున్నాయి.
Also Read : ఏలూరు ఘటనపై అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం.. డబ్ల్యూహెచ్ఓ సహకారం కోరిన జగన్ సర్కార్..