ఏపీ సీఎం జగన్ రైతుల విషయంలో పలు చారీత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్‌ఆర్‌లా రైతుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేలా ఆయన అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ‘రైతు భరోసా’ పథకం కౌలు రైతులకు ఇవ్వనున్నట్లు తాజాగా సీఎం ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30లక్షల మంది కౌలు రైతులు లబ్దిపొందనున్నారు.
అయితే భూమి యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు న్యాయం చేయాలని సీఎం మంత్రులకు, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చట్టం తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఈ ఏడాది రబీ నుంచే ‘రైతు భరోసా’ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతనెలలోనే ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏటా రూ.12,500 ఇచ్చే ఈ పథకాన్ని… అక్టోబరు 15 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామన్నారు. కాగా వైఎస్సార్ జయంతి రోజైన జులై 8న ‘రైతు భరోసా’ పథకంతో పాటు 12 పథకాలను అమలులోకి తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.