KCR to send his daughter Kavitha to Rajyasabha: తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తన కుమార్తె, మాజీ లోక్‌సభ సభ్యురాలు కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం వుండగా.. అందులో ఒక బెర్త్ కవితకు ఇవ్వాలని కేసీఆర్ మీద విపరీతమైన ఒత్తిడి వున్నట్లు తెలుస్తోంది. దాంతో ఒక బెర్త్ కవితకు ఖరారు చేశారని.. మరో అభ్యర్థిత్వానికి పలువురు పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన గరికపాటి మోహన్ రావు, కేవీపీ రామచంద్రరావుల పదవీ కాలం ముగుస్తున్నందున రెండు స్థానాలకు గాను ఎన్నికల షెడ్యూల్ వెల్లడైంది. మార్చి 13వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఈ క్రమంలో తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి దక్కనున్నాయి. అయితే.. ఒక సీటు కవితకు కన్‌ఫర్మ్ అయితే.. మిగిలిన మరో సీటు కోసం పోటీ బాగానే వున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కోటాలో కొనసాగిన కే.కేశవరావు పార్టీకి పెద్దదిక్కులా వున్న నేపథ్యంలో ఆయన రెన్యువల్ కోరుకుంటున్నారని సమాచారం. అదే సమయంలో గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన కడియం శ్రీహరి, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా రేసులో వున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు కూడా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కీలకభూమిక పోషించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో డి.శ్రీనివాస్ పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన్ని మినహాయిస్తే.. మిగిలిన వారిలో ఇద్దరు ఓసీలున్నారు. వీరిలో ఒకరు కేసీఆర్ బంధువు సంతోష్ కాగా.. మరొకరు ఆయనకు సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు. సామాజిక సమీకరణల్లో భాగంగా చూస్తే.. ఒకటి ఓసీలకు, మరొకటి గిరిజనులకు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కేసీఆర్‌కు దూరపు బంధువు అయిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా రాజ్యసభకు వెళ్ళేందుకు ఉత్సాహం చూపుతుండగా.. ఆయనకు ఇటీవలనే కేబినెట్ హోదాలో పదవి దక్కింది. రాష్ట్ర కేబినెట్‌కు స్పెషల్ ఇన్వైటీగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కేసీఆర్‌కు సవాల్‌గా మారిందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ సమీకరణలు మారితే తప్ప కవిత రాజ్యసభకు వెళ్ళడం ఖాయమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.