హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తోంది. నగరంలో ఇప్పటికే మెట్రో సేవలు సిటీ జనాల రవాణాను సులభతరం చేశాయి. త్వరలో మరో రకం రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు సంవత్సరాలుగా ఈ అంశంపై చర్చ జరుగుతున్న ఇప్పడు దానికో రూపం వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రపంచ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే మార్గాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసే దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాల్లో రోప్‌వే మార్గాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో రెండు కారిడార్‌లతోపాటు యాదాద్రిలో మరో కారిడార్ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్ నుంచి సచివాలయం, ప్యారడైజ్ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు ఉన్నాయి. అలాగే పర్యాటకులతోపాటు భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు.