తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు అతి చేస్తే.. ఒక్క దెబ్బతో 80 శాతం మంది దేశం లీడర్లను జైలు పాలు చేయగలమని హెచ్చరించారు రోజా. నిరాధార ఆరోపణలతో టీడీపీ శ్రేణులు జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
బుధవారం తిరుమలలో మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్రను తప్పుపట్టారు. ఏపీ ప్రజలు చైతన్యవంతులై చంద్రబాబును, టీడీపీ నేతలను మూలన కూర్చోబెట్టారని అన్నారు రోజా. ప్రజలు ఇంట్లో కూర్చొబెట్టినా బుద్దిరాని చంద్రబాబు బస్సు యాత్ర చేస్తాననడం హాస్యాస్పదంగా వుందన్నారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పర్యటిస్తారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా చంద్రబాబు బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయనది నీతిమాలిన రాజకీయమని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు రియల్ ఏస్టేట్ కోసం పనిచేస్తారని, జగన్ రాష్ట్రం కోసం పని చేస్తారని రోజా చెప్పుకొచ్చారు.
14 రోజులు గడిచిన నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయకపోతే మూడు రాజధానుల బిల్లు చట్టంగా మారినట్లేనని రోజా చెబుతున్నారు. చంద్రబాబు అహంకారాన్ని చూసి దేవుడు కూడా దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాడని, దిశా యాప్ ను కూడా చంద్రబాబు తమ మహిళా నాయకురాళ్లతో కలిసి నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని రోజా ఆరోపించారు. నారా లోకేష్ కనుసన్నల్లో టీడీపీ సోషల్ మీడియా విభాగం వైసీపీపై విషం చిమ్మడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె అంటున్నారు.
నిరాధార ఆరోపణలతో పేట్రేగిపోతున్న తెలుగుదేశం నాయకులపై తాము ఫిర్యాదు చేయడం మొదలు పెడితే 80 శాతం టీడీపీ నేతలు జైళ్ళ పాలవుతారని రోజా వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో దేశం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తోందన్నారామె. ‘‘చంద్రబాబుకు వయసు మీద పడింది.. ఇంట్లో కృష్ణా, రామా అంటూ కూర్చుంటే మంచిది..’’ చంద్రబాబును ఎగతాళి చేశారు రోజా.