హైదరాబాద్‌లో అనూహ్య వాతావరణం నెలకొంది. డిసెంబరు వరకు చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షాకాలాన్ని తలపిస్తోంది. గురువారం మధ్యాహ్నం నగరంలో 14 మి.మీ వర్షపాతం నమోదైంది. 1922 నుండి ఇప్పటివరకు జనవరిలో నమోదైన వర్షపాతాలలో 36. మి.మీ వర్షపాతంతో ఈ సంవత్సరం రికార్డులకెక్కింది. రాగల 48 గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
“నగరం మీద కాన్‌ఫ్లంట్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు, పశ్చిమ దిశనుండి వీస్తున్న పవనాల కారణంగా, నగరంపై వర్షం పడే మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని ప్రాంతాలలో ప్రబలంగా ఉంది. అయినప్పటికీ, తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్రా తెలిపారు.
నగరంలో ఈ సారి శీతాకాలం ఆలస్యంగా మొదలైందని చెప్పారు. “జనవరి 10 వరకు ఉష్ణోగ్రత తగ్గడం అరుదు, ఆ తరువాత నగరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది” అని స్కైమెట్ ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త మహేష్ పలావత్ తెలిపారు. “సముద్రాల నుండి తేమతో కూడిన గాలి ప్రవాహం ఉంది, ఇది వాతావరణంలో అవరోధంగా ఏర్పడుతుంది. ఈ అవరోధం భూమి యొక్క ఉపరితలం నుండి వేడి ఆకాశానికి ప్రసరించకుండా ఆపుతుంది. దీనివల్ల భూమి ఉపరితలం వేడెక్కుతుంది” అని పలావత్ వివరించారు.