ఆయనకు అవే రెండు కళ్ళు… ఇదే ప్రూఫ్

|

Jan 21, 2020 | 5:52 PM

ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తానన్న పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి ఎందుకొచ్చారు? అటు రాజకీయ వర్గాల్లోను.. ఇటు సినీ వర్గాల్లోను పెద్ద ఎత్తున ఈ చర్చకు తెరలేచింది. రాజకీయాల్లోంచి మెల్లిగా తెరమరుగయ్యేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? ఈ ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. 90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి తమ్మునిగా టాలీవుడ్‌లోకి వచ్చి… తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని పవర్‌స్టార్‌గా పేరుపొందిన పవన్ కల్యాణ్… 2007-2009 మధ్య తనదైన శైలితో అన్నకు […]

ఆయనకు అవే రెండు కళ్ళు... ఇదే ప్రూఫ్
Follow us on

ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తానన్న పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి ఎందుకొచ్చారు? అటు రాజకీయ వర్గాల్లోను.. ఇటు సినీ వర్గాల్లోను పెద్ద ఎత్తున ఈ చర్చకు తెరలేచింది. రాజకీయాల్లోంచి మెల్లిగా తెరమరుగయ్యేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? ఈ ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు.

90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి తమ్మునిగా టాలీవుడ్‌లోకి వచ్చి… తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని పవర్‌స్టార్‌గా పేరుపొందిన పవన్ కల్యాణ్… 2007-2009 మధ్య తనదైన శైలితో అన్నకు అండగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పరిణామాలలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసినా.. తాను మాత్రం సినిమాలకే పరిమితమైపోయారు. అయితేనేం… తన రాజకీయ ఆకాంక్ష అలాగే బతికుందని చాటుతూ.. జనసేన పేరిట పార్టీ పెట్టి.. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అటు రాజకీయం.. ఇటు సినిమాలు.. ఇలా రెండింటా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ట్రై చేశారు పవన్ కల్యాణ్.

‘‘ నన్ను పవర్ స్టార్ అని పిలవొద్దు.. ప్రజల స్టార్‌గానే రాజకీయాల్లో కొనసాగుతా‘‘ డిసెంబర్ నెలలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇది. అలాగే పూర్తి టైమ్ పాలిటిక్స్‌లోనే ఆయన కొనసాగుతున్నారు. కానీ.. సడన్‌ ఓ బాలీవుడ్ రీమేక్ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు. దాంతో ఆయన దృష్టి మళ్ళీ సినిమాలపై పడిందా? అన్న సందేహాలు.. ఆదే కోణంలో పలు ఊహాగానాలు చెలరేగాయి.

జనవరి 20… ఏపీ చరిత్రలో అత్యంత కీలకమైన రోజుగా మిగిలే తేదీ అది. అలాంటి రోజునే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి పున: ప్రవేశం చేస్తున్నారన్న వార్త గుప్పు మంది. దాంతో అంత కీలకమైన రోజున ఆయన సినిమాలకు పరిమితమవడం ఏంటి? ఈ చర్చ చెలరేగింది సర్వత్రా. అయితే.. తన కమిట్‌మెంట్‌పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చాటుకున్నారు పవన్ కల్యాణ్.

జనవరి 20న అటు అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల బిల్లు రానుండడంతో అదే రోజు ఉదయమే హైదరాబాద్‌లో పింక్ హిందీ మూవీ రీమేక్ షూటింగ్‌లో కాసేపు పాల్గొని ఆ వెంటనే మంగళగిరికి తరలి వెళ్ళారు పవన్ కల్యాణ్. సినిమాల్లో చేయడం ప్రస్తుతం తనకు అవసరం అని చెబుతూనే రాజకీయాల్లో ప్రజలకిచ్చిన కమిట్‌మెంట్‌కు కట్టుబడి వుంటానని చాటారు. ఉదయాన్నే హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ ప్రారంభంలో కనిపించి.. వృత్తిపరమైన చిత్తశుద్దిని చూపించి.. ఆతర్వాత విజయవాడకు వెళ్ళి.. అక్కడ అమరావతి రైతులకు అండగా నిలబడ్డారు.

అఙ్ఞాతవాసి సినిమా తర్వాత ఫుల్ టైమ్ పాలిటిక్స్‌ వైపు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. 2018 సంక్రాంతికి రిలీజైన అఙ్ఞాతవాసి తర్వాత మరే సినిమాకు అంగీకారం తెలపలేదు పవన్ కల్యాణ్. రెండేళ్ళ పాటు ఏ పని చేయకపోతే.. మరి సొంత కుటుంబం పరిస్థితి ఏంటి? తన మెయింటేనెన్స్‌కు, పార్టీ నడిపేందుకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్ల ఫండ్స్ రైజ్ చేసే పరిస్థితి మిగిలిన పార్టీల్లాగా పవన్ కల్యాణ్‌కు లేదు. అందుకే కుటుంబ పోషణకు, సొంత మెయింటేనెన్స్‌కు వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో వుంటూ ప్రజా సేవ చేయాలన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం పింక్ రీమేక్‌తో పాటు.. క్రిష్ దర్శకత్వంలో వచ్చే పీరియాడికల్ మూవీకి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.

ఫుల్ టైమ్ పాలిటిక్స్.. పార్ట్ టైమ్ మూవీస్… ఇలా రెండు రంగాలను రెండు కళ్ళలా చూసుకోవాలన్నదే పవన్ కల్యాణ్ ప్రస్తుత నిర్ణయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అదే సమయంలో తాజాగా మళ్ళీ కుదిరిన బీజేపీ ఫ్రెండ్షిప్‌తో 2024 లక్ష్యంతో పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారని చెబుతున్నారు. ఈ నాలుగేళ్ళలో కనీసం నాలుగైదు సినిమాల్లో నటించడం ద్వారా తాను సంపాదించుకుంటూనే.. తన ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారని అంటున్నారు. అదే సమయంలో చిరకాల వాంఛ అయిన రాజకీయ లక్ష్యాన్ని సాధించేందుకు కూడా వ్యూహాత్మకంగా వెళతారని వారంటున్నారు.