Pawan Kalyan : అమరావతి రైతులకు అండగా ఉంటానని మరోసారి భరోసా ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఇవాళ(శనివారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా… గతంలోనే నిర్ణయం జరిగిపోయిందన్నారు. కాబట్టి రాజధాని ఎక్కడికీ మారబోదని, మారినా అది తాత్కాలికమేనని చెప్పారు. బీజేపీతో కలిసి రైతుల కోసం పోరాటం చేస్తానన్నారు పవన్ కల్యాణ్.
అహంకారంతో నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమన్నారు పవన్. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను అనుకోవడం లేదని పవన్ అన్నారు. ఒకవేళ అలా జరిగిన పక్షంలో బిజేపీతో జనసేన కలిసి ప్రయాణం చేయదని తేల్చి చెప్పారు. పొత్తుల గురించి వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక తనకు అధికారం లేదని, ఉన్న ఒక్క ఎమ్మెల్యే తమతో ఉన్నారో, లేదో తెలియదని..ప్రజల కోసం మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు పవన్.