కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నారా..? అయితే మీ పేరు దర్జాగా వేయించుకోండి. కొనిచ్చిన మీ అమ్మనాన్నలు పేర్లు రాయించుకోండి ..పర్లేదు..కానీ మీ క్యాస్ట్ పేరు వేయించారే వాయింపు మాములుగా ఉండదు. అలానే వాహనాల నంబర్ ప్లేట్లపై ‘కులం’ పేర్లను ముద్రించుకున్నవారికి నోయిడా పోలీసులు బెండు తీశారు.
కులం పేర్లతో పాటు, పలురకాల రెచ్చగొట్టే కొటేషన్స్‌ను నంబర్ ప్లేట్లపై ముద్రించుకున్నవారికి ఊహించని స్థాయిలో విధించారు.శుక్రవారం గౌతమ్ బుద్దనగర్ జిల్లాలో ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో నంబర్ ప్లేట్లపై ఇటువంటి కొటేషన్స్ ముద్రించిన 250 వాహనాలను గుర్తించారు. ఇందులో 133 వాహనాలపై కులం పేర్లు ముద్రించి ఉండగా.. మిగతా వాహనాలపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రాసినట్టుగా గుర్తించారు. ఇందులో బైక్స్‌తో పాటు ఇతర వాహనాలు కూడా ఉన్నాయి.
వాహనాలపై ఇటువంటివి ముద్రించడం ప్రజలను అభద్రతా భావానికి గురిచేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటి వాటికి దారితీస్తుందని గౌతమ్ బుద్దనగర్ ఎస్పీ వైభవ్ కృష్ణ అన్నారు. అందుకే ఇలాంటి చర్యలను ఉపేక్షించట్లేదన్నారు. ఇకముందు కూడా ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని చెప్పారు.