వరుస ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. దీంతో TPCC చీఫ్ పోస్టు కోసం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు, నాలుగు రోజులుగా కొత్త సారధి వేటలో పడ్డారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు. దీనిపై గాంధీభవన్‌లో సమావేశమైన పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, DCC అధ్యక్షులతో మాట్లాడారు, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే సారధిపై సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక… అధిష్టానానికి నివేదిక ఇస్తారు ఠాకూర్. ఆ తర్వాత హైకమాండ్ నుంచి నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు నేతలు. ఇప్పటికే చాలా మంది తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాకూర్ అధిష్టానానికి ఎలాంటి అభిప్రాయాన్ని చెబుతారన్నది ఆసక్తిగా మారింది.
టీపీసీసీ రేసులో చాలా మందే ఉన్నట్టు తెలుస్తోంది. కొంత మంది ఇప్పటికే తాము రేస్‌లో ఉన్నామని ప్రకటించారు. తమకు ఒక్కచాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు బీసీలకే టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే వాదన కూడా ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, వీహెచ్, అంజన్‌కుమార్‌యాదవ్, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. మాణిక్కం ఠాకూర్ ఇచ్చే నివేదికపైనే కొత్త సారధి ఎవరనేది తేలే అవకాశం ఉంది.
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దుబ్బాకలో మూడోస్థానానికి పరిమితం కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో కేవలం రెండు డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో తాను టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్త సారధి వచ్చే వరకూ ఉత్తమ్‌నే టీపీసీసీ చీఫ్‌గా కొనసాగాలని ఆదేశించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే కొన్ని రోజుల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారధి వచ్చే అవకాశం ఉంది.